Telangana: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కలకలం... చెత్తలో 3 తుపాకులు లభ్యం

  • శాసన మండలి భవనాన్ని ఆనుకుని ఉన్న జూబ్లీ హాల్
  • జూబ్లీ హాల్ పరిసరాలను శుభ్రం చేస్తుండగా కనిపించిన తపాకులు
  • చెట్ల పొదల్లో ఓ తపంచా, 2 కంట్రీమేడ్ రివాల్వర్లు లభ్యం
  • తుపాకులను స్వాధీనం చేసుకున్న సైఫాబాద్ పోలీసులు
3 revolvers spotted at jublee hall bushes in the premises of ts assembly

హైదరాబాద్ నగరంలోని తెలంగాణ శాసన సభ ప్రాంగణంలో శుక్రవారం కలకలం చోటుచేసుకుంది. అసెంబ్లీ ప్రాంగణంలోని శాసన మండలి భవనానికి ఆనుకుని ఉన్న జూబ్లీ హాల్ పరిసరాల్లో 3 తుపాకులు లభ్యమయ్యాయి. జూబ్లీ హాల్ పరిసరాల్లోని చెత్తను తొలగిస్తుండగా... చెట్ల పొదల్లో ఓ తపంచాతో పాటుగా 2 కంట్రీమేడ్ రివాల్వర్లు బయటపడ్డాయి. దీంతో ఆందోళనకు గురైన సిబ్బంది వెనువెంటనే సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన అక్కడకు చేరుకుని తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వానికి సంబంధించి ఏ ముఖ్య కార్యక్రమం అయినా జూబ్లీ హాల్ వేదికగానే జరిగేది. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఉన్నత స్థాయి అధికారులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యే వారు. ఇలాంటి ప్రదేశంలో తుపాకులు... అది కూడా చెట్ల పొదల్లో లభించడం గమనార్హం.

More Telugu News