blood sugar: మధుమేహం నియంత్రణకు 6ఎం ఫార్ములా

  • రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలోనే ఉందా చెక్ చేసుకుంటుండాలి
  • తినే ఆహారం విషయంలో నియంత్రణలు అవసరం
  • వైద్యుల సూచన లేకుండా ఔషధాలు ఆపకూడదు
Expert reveals easy 6M formula to manage blood sugar

నిశ్చల జీవితం, పీచు లేని, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారం, మానసిక ఒత్తిళ్లు, నిద్ర లేమి ఇవన్నీ కలసి 30 ఏళ్లకే మధుమేహాన్ని తీసుకొస్తున్నాయి. అందుకే చిన్న వయసు నుంచే ఆహారంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి. మన దేశం క్రమంగా డయాబెటిస్ కు కేంద్రంగా మారుతోంది. 

మధుమేహం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మెరుగైన ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి. వైద్యుల సూచనల మేరకు ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకుని, సూచించిన మేరకు మందులు తీసుకుంటే.. సమస్య లేనట్టుగానే భావించొచ్చు. ఎండోక్రైనాలజిస్ట్, డయాబెటాలజిస్ట్, మెటబాలిక్ సూపర్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ అల్తమాష్ గ్లూకోజు స్థాయుల నియంత్రణకు 6ఎం ఫార్ములా సూచిస్తున్నారు. 6M అంటే Monitor, Mindful eating, Moderation, Medicine, Move, Meet. 

మానిటర్ (పర్యవేక్షణ)
మధుమేహం ఎంతలో ఉంటుందన్నది ఇంట్లో పర్యవేక్షిస్తుండాలి. దీని ద్వారా తమ రిస్క్  గురించి సరైన అవగాహన ఉంటుంది. 

మైండ్ ఫుల్ ఈటింగ్ (తినే ఆహారం పై శ్రద్ధ)
నోటి రుచి కోసం నచ్చింది తినే స్వేచ్ఛ మధుమేహులకు లేదు. పోషకాహారాన్ని, పరిమితంగా తీసుకోవాలి. అది కూడా డయాబెటిస్ స్పెషలిస్ట్ లు, న్యూట్రిషనిస్టులు సూచించిన మేరకే.

మోడరేషన్ (మోస్తరు) 
అలాగే, తినే ఆహారం మోస్తరుగా ఉండాలి. అధికంగా తినకూడదు. అలా అని మరీ తక్కువగానూ తినడం మంచిదేమీ కాదు. పెద్దలకు మహిళలు అయితే రోజులో 2,000 కేలరీలు అవసరం. పురుషులకు 2,500 కేలరీలు అవసరం. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి.

మెడిసిన్ (ఔషధాలు)
బ్లడ్ గ్లూకోజ్ చెక్ చేసుకుని నార్మల్ గా ఉందని టాబ్లెట్ వేసుకోరు కొందరు. అలాగే కొందరు తమంతట తామే డోసేజీ తగ్గించుకుంటారు. దీన్నే సొంత వైద్యం అంటారు. కానీ, వైద్యుల సూచన మేరకే ఇది చేయాలి. వారు చెప్పనంత వరకు ఔషధాలు నిలిపివేయకూడదు.

మూవ్ (కదలికలు)
అన్నిటికంటే ముఖ్యంగా శారీరక కదలికలు ఎంతో అవసరం. రోజులో 30-40 నిమిషాల పాటు నడవాలి. వారంలో ఐదు రోజులు అయినా ఇది తప్పనిసరి. ఇక దిన చర్యల్లో భాగంగా వీలైనప్పుడల్లా నడకతోనే పని చేసుకోవాలి. దీనివల్ల అదనపు కేలరీలు ఖర్చయిపోయాయి. దీంతో నిల్వ ఉండి కొవ్వుగా మారి హాని చేయవు. రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది.

మీట్ (వైద్యులను కలవడం)
మధుమేహంతో ఉన్నవారు కనీసం మూడు నెలలకు ఒకసారి అయినా వైద్యులను సంప్రదించాలి. లేదా బ్లడ్ గ్లూకోజ్ స్థాయుల్లో అసహజ మార్పులున్నా కానీ వైద్యుల సలహా తీసుకోవాల్సిందే.

More Telugu News