brown rice: బ్రౌన్ రైస్ అయినా ఓకే.. వైట్ రైస్ మాత్రం వద్దు!

  • వైట్ రైస్ లో పీచు ఉండదు
  • విటమిన్లు, పోషకాలు చాలా తక్కువ
  • బ్రౌన్ రైస్ లో ఫైబర్, ప్రొటీన్, పాలీ ఫెనాల్స్
  • విటమిన్లు, మినరల్స్ తో ఆరోగ్యానికి మేలు
  • మధుమేహం ఉన్న వారికి మంచి ఆప్షన్
Why brown rice and not white is the healthier choice

దక్షిణాది వాసులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఇష్టంగా తినే తెల్ల బియ్యంతో ఆరోగ్యానికి లభించే మేలు ఏమీ లేదు. దీనికి బదులు బ్రౌన్ రైస్ తీసుకోవడం నయమన్నది నిపుణుల అభిప్రాయం. బ్రౌన్ రైస్ అన్నది పాలిష్ పట్టని ముడి బియ్యం. ఇందులో ఫైబర్ తోపాటు, వ్యాధులపై పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే, విటమన్ బీ, ఫైటో న్యూట్రియంట్లు, మినరల్స్ కూడా లభిస్తాయి. అంటే ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన సమతులాహారం ఇది. 

ఒక కప్పులో మూడింట ఒకటో వంతు బ్రౌన్ రైస్ లో 1.1 గ్రాముల ఫైబర్ ఉంటుంది. వైట్ రైస్ లో ఇది కేవలం 0.2 గ్రాములే. బ్రౌన్ రైస్ లో 1.93 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. ఫైబర్ వల్ల నిదానంగా జీర్ణమవుతుంది. దీనివల్ల వైట్ రైస్ మాదిరిగా తిన్న కొద్ది సమయానికే మళ్లీ ఏదో ఒకటి తినాలని అనిపించదు. 

హైపో అలెర్జిక్
బ్రౌన్ రైస్ లో అలెర్జికీ గురి చేసే ప్రాపర్టీలు తక్కువ. ఇందులో గ్లూటెన్, లాక్టోస్ ఉండవు. పోషకాల లోపం లేకుండా ఉండాలంటే బ్రౌన్ రైస్ తీసుకోవడం పరిష్కారం. 

గుండెకు మంచిది
బ్రౌన్ రైస్ లో ఉండే ప్లాంట్ లిగ్నాన్స్ గుండె జబ్బుల నుంచి రక్షణగా పనిచేస్తాయి. ఇందులో ఉండే మెగ్నీషియం కూడా గుండె ఆరోగ్యానికి మంచి చేసేదే. గుండె స్పందనలను క్రమబద్ధీకరిస్తుంది. బ్రౌన్ రైస్ లోని సెలీనియం గుండెను బలపరిచే యాంటీ ఆక్సిడెంట్. 

జీర్ణానికి అనుకూలమే
బ్రౌన్ రైస్ లో ఉండే మాంగనీస్ జీర్ణ రసాల తయారీకి సాయపడుతుంది. పైగా ఇందులోని ఫైబర్ (పీచులాంటి పదార్థం) కూడా సాఫీ జీర్ణానికి సాయపడేదే. మలబద్ధకం వంటి సమస్యలున్నవారికి కూడా అనుకూలం.

మధుమేహం, బరువు నియంత్రణ
మధుమేహం ఉన్న వారికి రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రణలో ఉంచుకోవడం ఆరోగ్య రీత్యా ఎంతైనా అవసరం. కానీ, వైట్ రైస్ లో ఫైబర్ లేకపోవడం వల్ల ఆహారం తీసుకున్న కొద్ది సేపటికే పెద్ద మొత్తంలో కార్బో హైడ్రేట్లు రక్తంలోకి చేరతాయి. దీంతో గ్లూకోజ్ పరిమాణం గణనీయంగా పెరుగుతుంది. కానీ, బ్రౌన్ రైస్ అలా కాదు. పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఉండడం వల్ల.. దీన్ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లుగా చెబుతారు. దీంతో గ్లూకోజ్ ఒకేసారి విడుదల కాదు. 

వండుకునే విధానం
సాధారణ వైట్ రైస్ మాదిరిగా బ్రౌన్ రైస్ ను వండుకోకూడదు. కావాల్సిన పరిమాణంలో బియ్యాన్ని కడిగేసి గోరు వెచ్చని నీటిలో 40 నిమిషాలు నానబెట్టిన తర్వాత ప్రెషర్ కుక్కుర్ లో పెట్టి ఉడికించుకోవాలి. బియ్యానికి రెండు రెట్లు నీరు కలుపుకోవాలి.

More Telugu News