16 years: స్మార్ట్ ఫోన్ కోసం తన రక్తం అమ్మకానికి పెట్టిన 16 ఏళ్ల అమ్మాయి

16 year old girl tries to sell her blood to buy a smartphone in West Bengal
  • అన్ లైన్ లో రూ. 9 వేల ఖరీదైన ఫోన్ బుక్ చేసిన బెంగాల్ యువతి
  • డబ్బు లేకపోవడంతో రక్తం అమ్ముతానంటూ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన వైనం
  • కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించిన శిశు సంక్షేమ అధికారులు
మనలో చాలా మంది మంచి ఫీచర్స్ ఉన్న, ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉండాలని కోరుకుంటారు. కొంచెం కష్టపడి అయినా మంచి ఫోన్ కొనాలనుకుంటాం. అయితే, బెంగాల్‌లోని దినాజ్‌పూర్‌కు చెందిన 16 ఏళ్ల అమ్మాయి స్మార్ట్ ఫోన్ కొనేందుకు ఏకంగా తన రక్తాన్ని విక్రయించాలని ప్రయత్నించింది. 12వ తరగతి చదువుతున్న సదరు యువతి ఆన్‌లైన్‌లో రూ. 9 వేల విలువైన స్మార్ట్‌ఫోన్‌ను ఆర్డర్ చేసింది. నాలుగు రోజుల్లో ఫోన్ డెలివరీ అవ్వాల్సి ఉండగా.. అంత డబ్బు ఏర్పాటు చేయడం తనకు కష్టమైంది. దీంతో ఆ యువతి బలూర్‌ఘాట్‌లోని జిల్లా ఆసుపత్రిలో డబ్బుకు బదులుగా తన రక్తాన్ని విక్రయించాలని నిర్ణయించుకుంది. 

ట్యూషన్‌కు వెళ్తున్నానని ఇంట్లో  చెప్పి ఆసుపత్రికి చేరుకుంది. అక్కడి బ్లడ్ సెంటర్ కి వెళ్లి రక్తం ఇస్తాను డబ్బులు కావాలని చెప్పడంతో సిబ్బంది షాకయ్యారు. అనుమానం వచ్చిన బ్లడ్ సెంటర్ సిబ్బంది శిశు సంక్షేమ అధికారులకు సమాచారం ఇచ్చారు. మొదట్లో తన సోదరుడి చికిత్స కోసం తన రక్తాన్ని విక్రయించాలనుకుంటున్నట్లు చెప్పిన సదరు యువతి కౌన్సెలింగ్ తర్వాత అసలు విషయం వెల్లడించింది. ఆమెను మందలించిన సిబ్బంది.. జిల్లా శిశు సంక్షేమ కమిటీ సహకారంతో యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు.
16 years
girl
smart phone
sell
blood
West Bengal

More Telugu News