Visakhapatnam: వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన యువకుడు.. రూ. 40 లక్షలు ఇవ్వాలన్న వినియోగదారుల ఫోరం

  • కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన యువకుడు
  • ఆపరేషన్ చేసిన వైద్యులు
  • ఆ తర్వాత కోమాలోకి వెళ్లి మృతి చెందిన తులసీరాం
  • వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించిన కుటుంబ సభ్యులు
  • రంగంలోకి మానవహక్కుల కమిషన్
  • వైద్య సేవల్లో లోపం ఉందని నిర్ధారించిన ఫోరం
Consumer Forum Orders to Give Rs 40 Lakh To Patients Family

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఓ యువకుడి కుటుంబానికి రూ. 40 లక్షల పరిహారం అందించాలని ఆసుపత్రి, అందులో పనిచేసే ముగ్గురు వైద్యులను వినియోగదారుల ఫోరం ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్టణానికి చెందిన శీలా తులసీరామ్ (23) కడుపునొప్పితో బాధపడుతూ 8 అక్టోబరు 2013న నగరంలోని క్వీన్ ఎన్నారై ఆసుపత్రిలో చేరాడు. 

పరీక్షించిన వైద్యులు 24 గంటల నొప్పితో బాధపడుతున్నాడని, శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో అదే రోజు రాత్రి 9 గంటలకు ఆపరేషన్ చేశారు. శస్త్రచికిత్స తర్వాత యువకుడు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో యువకుడిని ఐసీయూకు తరలించారు. అయితే, ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియకుండా దాచారు. 

ఆ తర్వాత యువకుడు కోమాలోకి వెళ్లాడని కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత మూడు రోజులకే అంటే 12న తులసీరాం మృతి చెందాడు. దీంతో వైద్యులతో బాధిత కుటుంబ సభ్యులు వాగ్వివాదానికి దిగారు. తులసీరాంకు ఎలాంటి అనారోగ్య  సమస్యలు లేవని, ఎలా చనిపోతాడని ప్రశ్నించారు. 2015లో తులసీరాం కుటుంబ సభ్యులు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. 

వైద్య సేవల్లో నిర్లక్ష్యం కారణంగా తులసీరాం మృతి చెందాడని ఆసుపత్రి యాజమాన్యం, ఆపరేషన్ చేసిన వైద్యుల నుంచి 99.99 లక్షల పరిహారం ఇప్పించాలని కోరారు. ఈ మేరకు క్వీన్ ఎన్నారై ఆసుపత్రి యాజమాన్యంతోపాటు చికిత్స అందించిన జనరల్ సర్జన్ డాక్టర్ టీఎస్ ప్రసాద్, మత్తుమందు వైద్యులు డాక్టర్ తనూజ రాజ్యలక్ష్మీదేవి, డాక్టర్ రవిచంద్రహాస్‌లను బాధ్యులుగా పేర్కొన్నారు.

కేసును విచారించిన కమిషన్.. రికార్డుల్లో చికిత్స అందించిన విషయాన్ని నమోదు చేయలేదన్న విషయాన్ని డాక్టర్ తనూజ అంగీకరించినట్టు పేర్కొంది. వైద్య సేవల్లో లోపం కారణంగానే తులసీంరాం మరణించినట్టు నిర్ధారించింది. ఈ కేసుపై విచారణ జరిపిన ఏపీ వైద్య మండలి కూడా మెడికల్ రిజిస్టర్ నుంచి డాక్టర్ తనూజ పేరును ఆరు నెలలపాటు తొలగించింది.

మానవ హక్కుల కమిషన్ ద్వారా కేజీహెచ్ వైద్యుల బృందం ఈ ఘటనపై విచారణ జరిపింది. వైద్య సేవల్లో యాజమాన్య లోపం, మత్తుమందు వైద్యుల నిర్లక్ష్యం ఉందని స్పష్టం చేసింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న వినియోగదారుల ఫోరం బాధిత కుటుంబానికి రూ. 40 లక్షల పరిహారం అందించాలని ఆసుపత్రి యాజమాన్యంతోపాటు ముగ్గురు వైద్యులను ఆదేశిస్తూ తీర్పు చెప్పింది.

More Telugu News