Guntur: గుంటూరులో పట్టపగలు అందరూ చూస్తుండగానే దారుణ హత్య

Dreaded murder in guntur rowdy sheeter killed
  • గత రాత్రి 8 గంటల సమయంలో ఘటన
  • కత్తులు, వేటకొడవళ్లతో వెంటాడి మరీ దారుణం
  • బాధితుడు ఓ హత్యకేసులో నిందితుడు
గుంటూరులో గతరాత్రి అందరూ చూస్తుండగా దారుణహత్య జరిగింది. కొందరు దుండగులు నడి రోడ్డుపై యువకుడిని వెంటాడి కత్తులు, వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. కళ్లముందే జరిగిన దారుణం చూసి జనం భయభ్రాంతులకు గురయ్యారు. తనను వెంటాడుతున్న దుండగుల నుంచి తనను తాను కాపాడుకోవడానికి బాధిత యువకుడు ఓ కిరాణాషాపులోకి వెళ్లి దాక్కోగా, బయటకు ఈడ్చుకు వచ్చి మరీ దారుణంగా హత్య చేశారు. పట్నంబజార్ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయానికి సమీపంలోని బాబు హోటల్ వద్ద గత రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగిందీ ఘటన. 

బాధితుడిని నల్లచెరువు ఆరో లైన్‌కు చెందిన 38 ఏళ్ల దొడ్డి రమేశ్‌గా గుర్తించారు. రమేశ్ ఫైనాన్స్ వ్యాపారంతోపాటు శుభకార్యాలకు డెకరేషన్ పనులు చేస్తుంటాడు. హత్యకు ముందు రమేశ్ ఇంట్లోనే ఉన్నాడని, స్నానానికి వెళ్లేందుకు రెడీ అవగా ఫోన్ రావడంతో బయటకు వెళ్లాడని రమేశ్ తల్లి తెలిపారు. 

రమేశ్‌ ఓ హత్యకేసులో నిందితుడని, అతడిపై రౌడీషీట్ కూడా ఉందని పోలీసులు తెలిపారు. కాగా, తన భర్తను బుడంపాడుకు చెందిన రౌడీ షీటర్ ఆర్కే హత్య చేశాడని రమేశ్ భార్య లత ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పరారీలో ఉన్న నిందితుల కోసం రెండు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
Guntur
Murder
Andhra Pradesh
Rowdy Sheeter

More Telugu News