Chandrababu: పవన్ ఎయిర్ పోర్టు నుంచి హోటల్ కు వెళ్లేంతవరకు ఎంత వేధించాలో అంతా వేధించారు: చంద్రబాబు

Chandrababu extends solidarity to Pawan Kalyan
  • విజయవాడలో పవన్ తో చంద్రబాబు భేటీ
  • పవన్ కు సంఘీభావం ప్రకటించిన వైనం
  • సంయుక్తంగా మీడియా ముందుకు వచ్చిన చంద్రబాబు, పవన్
  • పవన్ కు ఎదురైన పరిస్థితులు బాధ కలిగించాయన్న టీడీపీ అధినేత
పవన్ కల్యాణ్ కు విశాఖలో ఎదురైన పరిస్థితులు బాధ కలిగించాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. విజయవాడలో ఆయన జనసేనాని పవన్ కల్యాణ్ తో కలిసి సంయుక్తంగా మీడియా ముందుకొచ్చారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, జనసేన కార్యక్రమాన్ని నిర్ణయించుకుని, ఆ ప్రకారమే పవన్ కల్యాణ్ విశాఖ వెళ్లారని, కానీ వైసీపీ వాళ్లు మరో రోజు తమ కార్యక్రమం పెట్టుకోకుండా అదే రోజున పెట్టుకున్నారని విమర్శించారు. 

ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా విశాఖ వెళ్లిన పవన్ ను ఎయిర్ పోర్టు నుంచి హోటల్ కు వెళ్లేంతవరకు ఎంత వేధించాలో అంతా వేధించారని ఆరోపించారు. వీధుల్లో లైట్లు వెలగకుండా చేశారని, చీకట్లో పంపించారని తెలిపారు. ఓ పోలీసు అధికారి కావాలనే పవన్ కారెక్కి ఆయనను కదలనివ్వకుండా నడిరోడ్డుపై నిలిపివేయాలని అనుకున్నాడని చంద్రబాబు వివరించారు.

"ఒక ఉన్మాది పాలనలో పైశాచిక ఆనందం కోసం ఇలాంటి తప్పుడు పనులు చేశారు. రాత్రంతా ఆయన హోటల్ రూంలో ఉంటే అక్కడ భయంకరమైన వాతావరణాన్ని సృష్టించారు. ఈ రాష్ట్రంలో పవన్ కల్యాణ్ పౌరుడు కాదా? విశాఖ వెళ్లేందుకు ఆయనకు అర్హత లేదా? చివరికి ఆయనకు నోటీసులు ఇచ్చి ఇక్కడికి పంపించారు. పవన్ వల్ల ఏం లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందో చెప్పండి. 

మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. వారే దాడులు చేస్తారు, వారే కేసులు పెడతారు. వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే మనమీదే కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. ప్రజలకు, మీడియాకు స్వేచ్ఛలేని పరిస్థితి వచ్చింది. 

పవన్ కు ఎదురైన పరిస్థితుల పట్ల నాకు చాలా బాధ కలిగింది. అందుకే ఇవాళ పవన్ ను కలిసి సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాను. అందుకే అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నాను. ముందు పార్టీల మనుగడ కాపాడుకుందాం, అప్పుడే ప్రజల కోసం పోరాడగలం. ఎవరికి ఓటేయాలో ఎన్నికలప్పుడు ప్రజలే నిర్ణయించుకుంటారు" అని పేర్కొన్నారు.
Chandrababu
Pawan Kalyan
TDP
Janasena
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News