Allu Aravind: నన్ను మా నాన్న కొట్టడం మా ఆవిడ చూడలేదనుకున్నాను: అల్లు అరవింద్

  • తాజా ఇంటర్వ్యూలో తండ్రి ప్రస్తావన తెచ్చిన అల్లు అరవింద్
  • తండ్రికి కోపం వచ్చిన సంఘటన గురించి వివరణ 
  • తనపై చేయి చేసుకున్నారని వెల్లడి 
  • ఆ సంఘటన తన భార్య చూడటమే కొసమెరుపంటూ నవ్వులు  
Allu Aravind Interview

అల్లు సామ్రాజ్యాన్ని అల్లు  అరవింద్ విస్తరించుకుంటూ వెళుతున్నారు. 'ఆహా'ను సక్సెస్ ఫుల్ తెలుగు ఓటీటీ సంస్థగా నిలబెట్టిన ఆయన, అల్లు స్టూడియోను కూడా ఇండస్ట్రీకి అందుబాటులోకి తీసుకుని వచ్చారు. 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన పాల్గొనగా, సెకండ్ పార్టు నిన్న ప్రసారమైంది. ఈ ఎపిసోడ్ లో అల్లు అరవింద్ ఒక తమాషా సంఘటనను గురించి ప్రస్తావించారు. 

"అప్పుడు నాకు 45 .. 47 ఏళ్లు ఉంటాయి. మా అమ్మా నాన్నలు ఏదో విషయంపై గొడవ పెట్టుకున్నారు. మా నాన్నకి కోపం వచ్చేసి, చెప్పులు కూడా వేసుకోకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నారు. మా అమ్మ చెప్పడంతో నేను కంగారుగా కారు తీసుకుని వెనక వెళ్లాను. మా నాన్న రోడ్డుకెక్కాడు అనే కోపం నాలో ఉంది. "నేను కారు ఎక్కను .. మీ అమ్మతో జీవితంలో మాట్లాడను' అని నాన్న కేకలు వేస్తున్నారు. 

చివరికి ఆయనను బ్రతిమాలుకుని కారు ఎక్కించుకుని ఇంటికి తీసుకుని వచ్చాను. కారు ఇంట్లోకి వస్తుండగా బ్రేక్ వేశాను. సడన్ బ్రేక్ కారణంగా మా నాన్నగారు ముందుకు తూలి పడబోయారు. 'ఎవడ్రా నీకు డ్రైవింగ్ నేర్పిన వెధవ' అంటూ లాగిపెట్టి నా చెంపపై కొట్టారు. వెంటనే నేను .. మా ఆవిడగాని చూసిందేమోనని అటూ ఇటూ చూశాను. ఎక్కడా ఎవరూ కనిపించకపోవడంతో హమ్మయ్య అనుకున్నాను. ఇక ఆ విషయాన్ని పెద్దది చేస్తే నన్ను కొట్టిన విషయం తెలిసిపోతుందని సైలెంట్ అయ్యాను. 

అమ్మానాన్నల గొడవ సద్దుమణిగింది. ఆ తరువాత నేను బెడ్ రూమ్ లోకి వెళ్లాను. 'ఇందాకటి నుంచి అడుగుదామని వెయిట్ చేస్తున్నాను .. ఎందుకండీ మామయ్య గారు మిమ్మల్ని అలా కొట్టారు?' అని మా ఆవిడ అడిగింది. 'నువ్వెక్కడి నుంచి చూశావు?' అని అడిగాను. 'పైన వరండాలో నుంచి చూశాను .. మిమ్మల్ని కొట్టగానే నాకు భయం వేసి లోపలికి పారిపోయాను' అని చెప్పింది. ఆమెకి తెలియకూడదని నేను ఆవేశాన్ని అణచుకోవడం వలన ప్రయోజనం లేకుండా పోయిందే అని అప్పుడు అనిపించింది" అంటూ అరవింద్ నవ్వేశారు

More Telugu News