digital gold: మీ దగ్గర డిజిటల్ గోల్డ్ ఉందా.. అయితే, అది రాబడికి మంచి మార్గం!

  • సేఫ్ గోల్డ్ అందిస్తున్న వినూత్న పథకం
  • ఒక్కో కస్టమర్ 20 గ్రాముల వరకు లీజుకు ఇచ్చుకోవచ్చు
  • 3-6 శాతం వరకు వార్షిక రాబడి
  • రాబడి డిజిటల్ గోల్డ్ రూపంలోనే జమ
Now you can earn rent on your digital gold

ఈ మధ్య కాలంలో డిజిటల్ గోల్డ్ కు ప్రాధాన్యం పెరిగింది. బంగారంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న ఎన్నో మార్గాల్లో డిజిటల్ గోల్డ్ కూడా ఒకటి. ఫోన్ పే, పేటీఎం సహా ఎన్నో వేదికలు డిజిటల్ గోల్డ్ కొనుగోలుకు వీలు కల్పిస్తున్నాయి. మార్కెట్ రేటు ఆధారంగా డిజిటల్ గోల్డ్ ను కొనుగోలు చేసుకుని, విక్రయించుకోవచ్చు. ఈ సంస్థల్లో కొనుగోలు చేసిన డిజిటల్ గోల్డ్ వ్యాలెట్లలో స్టోర్ అవుతుంది. ఈ కొనుగోలు విలువకు సరిపడా భౌతిక బంగారాన్ని సేఫ్ గోల్డ్ తదితర సంస్థలు వోల్ట్ లలో నిల్వ చేస్తాయి. కావాలంటే డిజిటల్ గోల్డ్ ను భౌతిక బంగారం రూపంలో డెలివరీ తీసుకోవచ్చు.


అయితే, ఇలా కొనుగోలు చేసిన డిజిటల్ గోల్డ్ పై రాబడి అందించే ఓ పథకాన్ని సేఫ్ గోల్డ్ అందిస్తోంది. మీ దగ్గరున్న డిజిటల్ గోల్డ్ లీజుకు ఇస్తే చాలు. కస్టమర్లు నేరుగా జ్యుయలర్స్ కు తమ డిజిటల్ గోల్డ్ ను లీజుకు ఇచ్చే సదుపాయాన్ని సేఫ్ గోల్డ్ తీసుకొచ్చింది. ఎంత కాలానికి లీజుకు ఇస్తున్నారనే దానిపై రాబడి ఆధారపడి ఉంటుంది. 

ఒక కస్టమర్ కనీసం అర గ్రాము నుంచి గరిష్ఠంగా 20 గ్రాముల వరకు లీజుకు ఇచ్చుకోవచ్చు. 30 రోజుల నుంచి 360 రోజుల కాలాన్ని ఎంచుకోవచ్చు. అయితే తమ ప్లాట్ ఫామ్ పై ఎక్కువ లీజులు 90-180 రోజుల కాలానికి ఉంటున్నట్టు సేఫ్ గోల్డ్ అంటోంది. వార్షిక రాబడి 3-6 శాతం మధ్య ఉంటుంది. ప్రతి నెలా ఈ వడ్డీ ఆదాయం కస్టమర్ డిజిటల్ గోల్డ్ అకౌంట్ కు డిజిటల్ గోల్డ్ రూపంలోనే జమ అవుతుంది. 

ఉదాహరణకు ఓ కస్టమర్ 10 గ్రాముల డిజిటల్ గోల్డ్ ను ఓ జ్యుయలర్ కు 3 శాతం వార్షిక వడ్డీ రేటుపై లీజుకు ఇచ్చారనుకుంటే, మూడు నెలల్లో 75 మిల్లీగ్రాముల బంగారాన్ని వడ్డీ రాబడి రూపంలో అందుకోవచ్చు. ఒకవైపు పెరిగే బంగారం ధరకు ఈ రాబడి అదనమని చెప్పుకోవచ్చు.

More Telugu News