Budda Venkanna: మంత్రి రోజా వేలు చూపించారు.. దానికి అర్థం ఏమిటో ఆమే చెప్పాలి: బుద్దా వెంకన్న

Roja showed finger to Janasena leaders says Budda Venkanna
  • వైజాగ్ ఎయిర్ పోర్టు వద్ద జనసైనికులు హుందాగా వ్యవహరించారన్న బుద్దా వెంకన్న
  • వైసీపీ మంత్రులే వారిని రెచ్చగొట్టారని వ్యాఖ్య
  • జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపాటు
వైజాగ్ ఎయిర్ పోర్టు వద్ద ఏపీ మంత్రులపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పలువురు జనసైనికులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మాట్లాడుతూ... ఎయిర్ పోర్టుకు మంత్రులు వచ్చేటప్పుడు తాను అక్కడే ఉన్నానని... జనసేన నేతలు, కార్యకర్తలు చాలా హుందాగా వ్యవహరించారని చెప్పారు. 

వైసీపీ మంత్రులే జనసేన శ్రేణులను రెచ్చగొట్టారని... జనసైనికులకు మంత్రి రోజా వేలును చూపించారని... దానికి అర్థం ఏమిటో ఆమే చెప్పాలని అన్నారు. ఇతర మంత్రులు కూడా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారని... దీంతో, అక్కడ చిన్న గొడవ జరిగి ఉండొచ్చని చెప్పారు. ఒక చిన్న విషయాన్ని భూతద్దంలో చూపించి... జనసేన శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. 

జనసేనాని పవన్ కల్యాణ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ప్యాకేజీ ఇచ్చారని వైసీపీ మంత్రులు మొరుగుతున్నారని బుద్దా వెంకన్న మండిపడ్డారు. జగన్ మాదిరి చంద్రబాబు అవినీతిపరుడు కాదని అన్నారు. పవన్ కల్యాణ్ కూడా అవినీతి రాజకీయ నాయకుడు కాదని... వైసీపీ నేతలు వారు చేస్తున్న అవినీతిని ఇతరులపైకి నెట్టి వేయడంలో ముందుంటారని విమర్శించారు. సీఎం అయిన తర్వాత ఎన్ని లక్షల కోట్లను జగన్ సంపాదించారో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విపక్ష నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిస్తూ, హింసిస్తూ జగన్ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని దుయ్యబట్టారు.
Budda Venkanna
Chandrababu
Telugudesam
Pawan Kalyan
Janasena
Roja
Jagan
YSRCP
Vizag

More Telugu News