Dhulipala Narendra Kumar: రైతు ఆత్మహత్యల్ని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబుపై జగన్ రెడ్డి దుష్ప్రచారం: ధూళిపాళ్ల నరేంద్ర

  • నేడు రైతు భరోసా నిధుల విడుదల
  • చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శలు
  • సీఎం విమర్శలను ఖండించిన టీడీపీ నేత ధూళిపాళ్ల
Dhulipalla Narendra condemns CM Jagan allegations on Chandrababu

రాష్ట్రంలో నిత్యం జరుగుతున్న రైతు ఆత్మహత్య ఘటనలను కప్పిపుచ్చుకునేందుకే రైతు భరోసా కార్యక్రమంలో చంద్రబాబుపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దుష్ప్రచారం చేశారని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

రైతు ఆత్మహత్యలు వైఎస్ కుటుంబ పేటెంట్ అన్న సంగతి గుర్తించాలని వ్యాఖ్యానించారు. ఆనాడు వైఎస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా... నేడు ఆయన కుమారుడు జగన్ రెడ్డి పాలనలో ఇప్పటికే 3 వేల మంది అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడ్డారని ధూళిపాళ్ల వివరించారు.

"వైఎస్ హయాంలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేశారు. వైఎస్ కుటుంబ పాలనలోనే పంటలకు గిట్టుబాటు ధరలు లభించక రైతుల్ని క్రాప్ హాలిడే పాలు చేశారు. నేడు మోటార్లకు మీటర్లు పెడుతూ జగన్ రెడ్డి రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారు. రాష్ట్రంలో రోజుకు సగటున ఇద్దరు నుంచి ముగ్గురు రైతులు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. 

నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక ప్రకారం జగన్ రెడ్డి పాలనలో వరుసగా రెండు సంవత్సరాలు దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో నిలిచింది. 2020తో పోల్చితే 2021లో 19 శాతం రైతు ఆత్మహత్యలు పెరిగాయి. ఎక్కువ అప్పులున్న రైతు కుటుంబాల్లోనూ ఏపీ ప్రథమ స్థానంలో ఉందన్న విషయాన్ని జగన్ రెడ్డి గ్రహించాలి. 

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం కాగితాలకే పరిమితమైంది. నాడు సుభిక్షంలో ఉన్న రైతాంగాన్ని నేడు దుర్భిక్షంలోకి నెట్టారు. ప్రజలను తప్పుదారి పట్టించడాన్ని ఇప్పటికైనా మానుకోవాలి" అంటూ హితవు పలికారు.

More Telugu News