Ponnala Lakshmaiah: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు... ఓటింగ్ సిబ్బందిపై పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం

  • కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక కోసం కొనసాగుతున్న పోలింగ్
  • శ్రీనివాస్ రెడ్డి పేరును తొలగించి ప్రతాప్ రెడ్డి పేరును జాబితాలో చేర్చిన వైనం
  • 45 ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తికి అన్యాయం జరిగిందని పొన్నాల ఫైర్
Ponnala Lakshmaiah fires on voting staff of Congress president polling

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. అధ్యక్ష పదవి కోసం మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ పోటీ పడుతున్నారు. హైదరాబాదులోని గాంధీభవన్ లో తెలంగాణ పీసీసీ ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓటు వేసేందుకు గాంధీభవన్ కు వచ్చిన పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అక్కడి ఓటింగ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వివరాల్లోకి వెళ్తే, నియోజకర్గానికి ఇద్దరు పీసీసీ ప్రతినిధుల చొప్పున ఓటు వేసేందుకు ఏఐసీసీ ఓటరు కార్డులను జారీ చేసింది. జనగామ నియోజకవర్గం నుంచి పొన్నాలతో పాటు, చెంచారపు శ్రీనివాస్ రెడ్డిలకు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. దీంతో, ఓటు వేసేందుకు ఇద్దరూ అక్కడకు చేరుకున్నారు. ఇదే సమయంలో ఓటు వేసేందుకు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కూడా అక్కడకు చేరుకున్నారు. చివరి క్షణంలో శ్రీనివాస్ రెడ్డి పేరు తొలగించి... ప్రతాప్ రెడ్డి పేరును ఓటరు జాబితాలో చేర్చినట్టు తెలుస్తోంది. 

ఈ క్రమంలో, శ్రీనివాస్ రెడ్డిని ఓటు వేసేందుకు అనుమతించకపోవడంతో ఓటింగ్ సిబ్బందిపై పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేశారు. 45 ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తికి అవమానం జరిగిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా పొన్నాలను జానారెడ్డి, ఇతర నేతలు సముదాయించారు. మరోవైపు, ఈ పరిణామంతో శ్రీనివాస్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి ఇద్దరినీ ఓటు వేయకుండా ఆపేశారు. ఇధ్దరిలో ఎవరు ఓటు వేయాలనేదానిపై ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది.

More Telugu News