నన్ను అరెస్టు చేసేందుకు పన్నాగం: మనీశ్ సిసోడియా
- సీబీఐ సమన్లపై స్పందించిన ఢిల్లీ డిప్యూటీ సీఎం
- గుజరాత్ ఎన్నికల ప్రచారానికి దూరం చేయడానికేనని ఆరోపణ
- ఈరోజు విచారణకు హాజరుకానున్న మనీశ్
- లిక్కర్ పాలసీ స్కాం కేసులో విచారించనున్న అధికారులు
గుజరాత్ లో ఓటమి ఖాయమని బీజేపీ నేతలకు అర్థమైందని సిసోడియా పేర్కొన్నారు. ఓటమి భయంతోనే ఆప్ ప్రచారానికి ఆటంకాలు కలిగిస్తున్నారని విమర్శించారు. అయితే, తనను అరెస్టు చేస్తే గుజరాత్ లో ఆప్ ఎన్నికల ప్రచారం ఆగదని సిసోడియా ట్వీట్ చేశారు. గతంలో సీబీఐ అధికారులు తన నివాసంలో సోదాలు చేసిన విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. దాదాపు 14 గంటల పాటు సోదాలు జరిపినా అధికారులకు ఏమీ దొరకలేదని చెప్పారు. తన నివాసంతో పాటు బ్యాంకు లాకర్లు కూడా తనిఖీ చేశారని, అందులోనూ ఏమీ దొరకలేదని వివరించారు. ఈ నేపథ్యంలోనే తనను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారని సిసోడియా ఆరోపించారు.