Uttar Pradesh: పాఠశాల బస్సులో భారీ కొండచిలువ.. ఆదివారం కావడంతో తప్పిన ముప్పు.. వీడియో ఇదిగో

  • పార్క్ చేసిన స్కూలు బస్సులోకి దూరిన కొండచిలువ
  • పదకొండున్నర అడుగుల పొడువు.. 80 కేజీల బరువున్న పాము
  • మేకలను తినేందుకు వచ్చి బస్సులో దూరిన వైనం
A python rescued from a school bus in Raibareli UP

పార్క్ చేసిన ఓ స్కూలు బస్సులోకి దూరిన భారీ కొండచిలువను అటవీ అధికారులు రక్షించి అడవిలో వదిలిపెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలిలో జరిగిందీ ఘటన. ఆదివారం కావడంతో ర్యాన్ పబ్లిక్ స్కూలుకు చెందిన బస్సును డ్రైవర్ తన ఇంటి సమీపంలో పార్క్ చేశాడు. బస్సులోకి దూరిన కొండచిలువ అందులో తిష్ఠ వేసింది. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. 

వెంటనే సర్కిల్ అధికారి వందన సింగ్, సిటీ మేజిస్ట్రేట్ పల్లవి మిశ్రా అక్కడికి చేరుకున్నారు. కొండచిలువను గమనించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. వారొచ్చి అరగంట పాటు కష్టపడి ఒడుపుగా బయటకు తీసి అటవీ ప్రాంతంలో వదలిపెట్టారు. బస్సులో దాక్కున్న కొండచిలువను బయటకు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 


రక్షించిన కొండ చిలువ పదకొండున్నర అడుగుల పొడవు, 80 కేజీల బరువు ఉన్నట్టు అధికారులు తెలిపారు. దానిని దాల్మౌ అడవిలో వదిలిపెట్టినట్టు పేర్కొన్నారు. ఆదివారం కావడంతో అదృష్టవశాత్తు బస్సు పార్కింగులో ఉందని, లేదంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు పేర్కొన్నారు. పార్క్ చేసిన బస్సు సమీపంలో మేకలు మేస్తుండడం కొండ చిలువను ఆకర్షించిందని, వాటి కోసం కొండచిలువ వచ్చి ఉంటుందని అధికారులు తెలిపారు. కొండచిలువను చూసి స్థానికులు కేకలు వేయడంతో అది భయపడి బస్సులోకి వెళ్లి దాక్కుని ఉంటుందని పేర్కొన్నారు.

More Telugu News