Rajasthan: భార్యను తల్లిని చేసేందుకు.. ఖైదీకి పెరోల్ మంజూరు చేసిన రాజస్థాన్ హైకోర్టు

POCSO Convict Serving Life Sentence Granted 15 Day Parole By Rajasthan High Court For The Purpose Of Progeny
  • అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దోషి  
  • వంశ పరిరక్షణ కోసమే దోషి భార్య పిటిషన్ దాఖలు చేసిందన్న న్యాయస్థానం
  • రూ. 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, రూ. లక్ష చొప్పున రెండు జామీను బాండ్లు సమర్పించాలన్న కోర్టు
తాను తల్లిని కావాలనుకుంటున్నానని, తన భర్తకు పెరోల్ మంజూరు చేయాలని కోరుతూ ఓ భార్య వేసిన పిటిషన్‌పై కోర్టు సానుకూలంగా స్పందించింది. అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమె భర్తకు 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌కు చెందిన రాహుల్ (25) బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, తాను తల్లిని కావాలనుకుంటున్నానని, తన భర్తకు పెరోల్ మంజూరు చేయాలని రాహుల్ భార్య హైకోర్టును ఆశ్రయించింది. 

ఈ కేసును విచారించిన జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ సమీర్ జైన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పిటిషనర్ కోరికను మన్నించింది. దోషి భార్య పిల్లలు కావాలని కోరుకుంటోందని, భర్త లేకుండా, భర్త నుంచి పిల్లలు కలగకుండా ఉండే పరిస్థితుల్లో ఆమె జీవించకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఆమె తన వంశ పరిరక్షణ కోసమే పిటిషన్ దాఖలు చేసిందని పేర్కొంది. పిటిషన్‌ను తిరస్కరిస్తే హక్కులను కాలరాసినట్టే అవుతుందన్న కోర్టు.. దోషికి 15 రోజుల పెరోలు మంజూరు చేస్తున్నట్టు పేర్కొంది. రూ. 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు లక్ష రూపాయల చొప్పున రెండు జామీను బాండ్లు సమర్పించి పెరోలు పొందొచ్చని సూచించింది.
Rajasthan
Rajasthan High Court
POCSO Convict
Progeny

More Telugu News