Telangana: ప్ర‌జాశాంతి పార్టీ అధినేత నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌... అయినా మునుగోడు బ‌రిలో కేఏ పాల్‌

  • మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో రెండు సెట్ల నామినేష‌న్లు వేసిన కేఏ పాల్‌
  • ప్ర‌జాశాంతి పార్టీ అభ్య‌ర్థి హోదాలో వేసిన నామినేష‌న్‌కు తిర‌స్క‌రణ‌
  • స్వతంత్ర అభ్య‌ర్థిగా వేసిన నామినేష‌న్‌ను అనుమ‌తించిన అధికారులు
ka paul contesting as a independent candidate in munugode bypolls

మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో నామినేష‌న్ల దాఖ‌లుకు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నమే గ‌డువు ముగిసింది. ఈ నేప‌థ్యంలో ఉప ఎన్నిక‌లో పోటీ చేసేందుకు ఆయా పార్టీలు, వ్య‌క్తులు దాఖ‌లు చేసిన నామినేష‌న్ల‌ను అధికారులు శ‌నివారం ప‌రిశీలించారు. ఇందులో భాగంగా నిబంధ‌న‌లకు అనుగుణంగా లేని నామినేష‌న్ల‌ను అధికారులు తిర‌స్క‌రించారు. ఇలా తిర‌స్క‌ర‌ణ‌కు గురైన నామినేష‌న్ల‌లో ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడి హోదాలో కేఏ పాల్ దాఖ‌లు చేసిన నామినేష‌న్ కూడా ఉంది.

అయినా కూడా కేఏ పాల్ ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న‌ట్లు అధికారులు శ‌నివారం సాయంత్రం ప్ర‌క‌టించారు. నామినేష‌న్ల దాఖ‌లుకు చివ‌రి రోజైన శుక్ర‌వారం కేఏ పాల్ రెండు సెట్ల నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. ఓ నామినేష‌న్‌ను ప్ర‌జాశాంతి పార్టీ అధ్యక్షుడి హోదాలో దాఖ‌లు చేయ‌గా... మ‌రో నామినేష‌న్‌ను ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా దాఖ‌లు చేశారు. 

ప్ర‌జాశాంతి పార్టీని గుర్తింపు లేని పార్టీగా ఇటీవ‌లే కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. దీంతో ప్ర‌జాశాంతి పార్టీ అధ్యక్షుడి హోదాలో దాఖలు చేసిన నామినేష‌న్‌ను తిర‌స్క‌రించిన అధికారులు.. ఇండిపెండెంట్ హోదాలో దాఖ‌లు చేసిన నామినేష‌న్‌ను మాత్రం అనుమ‌తించారు. ఫ‌లితంగా ప్ర‌జాశాంతి పార్టీ అభ్య‌ర్థిగా కాకుండా స్వతంత్ర అభ్య‌ర్థిగా కేఏ పాల్ బ‌రిలో ఉన్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు.

More Telugu News