Turkey: టర్కీ బొగ్గు గనిలో పేలుడు.. 25 మంది దుర్మరణం

25 killed dozens trapped in Turkey coal mine blast
  • టర్కీ ఉత్తర బార్టిన్ ప్రావిన్స్ లో ఘటన
  • ప్రమాద సమయంలో 110 మంది
  • 11 మందిని రక్షించిన సహాయ బృందాలు
  • ఇంకా గనుల్లోనే మరెంతో మంది
టర్కీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర బార్టిన్ ప్రావిన్స్‌లోని బొగ్గు గనిలో పేలుడు సంభవించి 25 మంది మరణించారు. మరెంతో మంది గాయపడి గనుల్లోనే చిక్కుకున్నారు. నల్ల సముద్ర తీరంలోని అమాస్రాలోని ఫెసిలిటీలో శుక్రవారం ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 మందిని రక్షించి చికిత్స అందిస్తున్నామని టర్కీ ఆరోగ్య మంత్రి ఫహ్రెటిన్ కోకా తెలిపారు. పేలుడు జరిగిన సమయంలో దాదాపు 110 మంది గనిలో పని చేస్తున్నారు. వారిలో దాదాపు సగం మంది 300 మీటర్ల లోతులో ఉన్నారు.

బొగ్గు గనులలో మండే వాయువులను సూచించే ఫైర్‌ డాంప్ వల్ల ఈ పేలుడు సంభవించిందని ప్రాథమిక అంచనా వేసినట్టు టర్కీ ఇంధన మంత్రి ఫాతిహ్ డోన్మెజ్ చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గని ప్రవేశానికి 300 మీటర్లు (985 అడుగులు) దిగువన పేలుడు సంభవించిందని బార్టిన్ గవర్నర్ కార్యాలయం తెలిపింది. ఈ గని ప్రభుత్వ యాజమాన్యంలోని టర్కిష్ హార్డ్ కోల్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందినది.

పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించనున్నట్లు బార్టిన్ ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ శనివారం ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు. ఈ ఘటనలో ప్రాణనష్టం మరింత పెరగకూడదని, గనిలో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు.
Turkey
coal mine blast
25 killed

More Telugu News