YSRCP: వైసీపీకి గెడ్డ‌పువ‌ల‌స స‌ర్పంచ్ సూరి నాయుడు రాజీనామా

heddapuvalasa sarpanch suri naidu resigns ysrcp
  • వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొన‌సాగుతున్న సూరి నాయుడు
  • రాష్ట్రంలో ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న జ‌రుగుతోంద‌ని ఆరోప‌ణ‌
  • దేవాడ మైనింగ్ బ్లాక్‌లో 200 ఎక‌రాల‌ను క‌డ‌ప రెడ్ల‌కు కట్ట‌బెడుతున్నార‌ని ఆరోప‌ణ‌
  • త్వ‌ర‌లో జ‌న‌సేన‌లో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌
ఉత్త‌రాంధ్ర‌లో అధికార వైసీపీకి చెందిన ఓ నేత శుక్ర‌వారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. విజ‌యన‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని గెడ్డ‌పువ‌ల‌స గ్రామ స‌ర్పంచ్ గా ఉన్న వైసీపీ నేత‌ తుమ్మ‌గంటి సూరి నాయుడు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేర‌కు పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు స్వ‌యంగా ఆయ‌నే ప్ర‌క‌టించారు. జ‌గ‌న్ వైసీపీని స్థాపించిన నాటి నుంచి పార్టీలో కొన‌సాగుతున్నాన‌ని, పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌తో క‌లిసి న‌డిచాన‌ని ఆయ‌న తెలిపారు. అయినా త‌న‌కు పార్టీలో న్యాయం జ‌ర‌గ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసిన సూరి నాయుడు... నాడు పార్టీని, పార్టీ అదినేత కుటుంబ స‌భ్యుల‌ను దూషించిన వారికే అంద‌లం ద‌క్కింద‌ని ఆరోపించారు.

వైసీపీకి రాజీనామా చేసిన సంద‌ర్భంగా సూరి నాయుడు జ‌గ‌న్ పాల‌న‌పై ఆరోప‌ణ‌లు చేశారు. చీపురుప‌ల్లి నియోజ‌కవ‌ర్గంలో దేవాడ మైనింగ్ బ్లాక్‌లో సుమారు 200 ఎక‌రాల‌ను క‌డ‌ప రెడ్ల‌కు అక్ర‌మంగా క‌ట్ట‌బెడుతున్నార‌ని ఆయ‌న‌ ఆరోపించారు. ఈ భూముల విలువ దాదాపుగా రూ.3 వేల కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని కూడా ఆయ‌న తెలిపారు. రాష్ట్రంలో ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న జ‌రుగుతోంద‌ని, ఆ పాల‌న‌కు నిర‌స‌న‌గానే తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. త్వ‌ర‌లోనే తాను జ‌న‌సేన‌లో చేర‌నున్న‌ట్లు సూరి నాయుడు ప్ర‌క‌టించారు.
YSRCP
YS Jagan
Andhra Pradesh
Suri Naidu
Cheepurupalli
Vijayanagaram District
Janasena

More Telugu News