Ravi Shastri: టీ20 ప్రపంచకప్ లో సెమీ ఫైనల్స్ కు వెళ్లే దేశాలు ఇవే: రవిశాస్త్రి

  • ఆస్ట్రేలియాలో జరగబోతున్న టీ20 ప్రపంచకప్
  • అక్టోబర్ 16న ప్రారంభం కానున్న మెగా టోర్నీ
  • ఇండియా, పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ కు వెళ్తాయన్న రవిశాస్త్రి
Ravi Shastris semi finalists for T20 world cup

టీ20 ప్రపంచకప్ కు సర్వం సిద్ధమయింది. ఆస్ట్రేలియాలో అక్టోబర్ 16 నుంచి ఈ మెగా టోర్నీ జరగబోతోంది. ఇప్పటికే టీమిండియా జట్టు ఆస్ట్రేలియాకు చేరుకుని... వార్మప్ మ్యాచ్ లు ఆడుతోంది. ఈ నేపథ్యంలో, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ టోర్నీకి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముంబైలో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఒక ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ... టీ20 ప్రపంచకప్ లో సెమీఫైనల్స్ కు చేరుకునే నాలుగు జట్ల గురించి తన అంచనాలను వివరించారు. ఇండియా, పాకిస్థాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ కు చేరుకుంటాయని ఆయన చెప్పారు. 

ప్రస్తుతం టీమిండియా మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో జరిగిన టీ20 సిరీస్ లను గెలుపొంది పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. పాకిస్థాన్ కూడా ఇటీవలి కాలంలో అనేక మ్యాచ్ లను ఆడటం ద్వారా కాన్ఫిడెంట్ గా ఉంది. ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఆ జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్న ఆస్ట్రేలియాకు... సొంత గడ్డపై టోర్నీ జరుగుతుండటం కలిసొచ్చే అంశం. 

మరోవైపు రవిశాస్త్రి మాట్లాడుతూ... సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యాలు ప్రపంచకప్ లో కీలక పాత్ర పోషిస్తారని అంచనా వేశారు. వీరిద్దరూ మ్యాచ్ విన్నర్లని కితాబిచ్చిన రవిశాస్త్రి... వీరిద్దరి ఫామ్ పై టీమిండియా జట్టు చాలా ఆధారపడి ఉందని చెప్పారు.

More Telugu News