Ukraine: రష్యా అధ్యక్షుడు పుతిన్ కు జీ7 దేశాల వార్నింగ్

G7 warns of severe consequences if Russia uses nuclear weapons
  • ఉక్రెయిన్ పై యుద్ధంలో అణ్వాయుధాలు ఉపయోగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక
  • రష్యా దాడులను ఖండించిన జీ7 దేశాల నాయకులు
  • ఉక్రెయిన్ కు అన్ని రకాల సాయం కొనసాగిస్తామని హామీ
ఉక్రెయిన్ పై  క్షిపణుల వర్షం కురిపిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు జీ7 దేశాల అధినేతలు వార్నింగ్ ఇచ్చారు. ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. యుద్ధంలో రష్యా అణ్వాయుధాలను ఉపయోగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉక్రెయిన్ లోని పలు నగరాలపై రష్యా విరుచుకుపడిన తర్వాత జీ7 దేశాల నాయకులు మంగళవారం వర్చువల్ గా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ కు అన్ని విధాలుగా సహాయం చేస్తామని పునరుద్ఘాటించారు. ఆ దేశానికి తాము ఆర్థిక, మానవ, సైనిక, దౌత్య, చట్టపరమైన సహాయాన్ని అందిస్తూనే ఉంటామన్నారు.

ఈ కష్టకాలంలో ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని జీ7 దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. మరోవైపు రష్యాను నిలువరించడానికి తమకు గగనతల రక్షణ సామర్థ్యాలను ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ జీ7 దేశాలను కోరారు. కాగా, ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేస్తున్నాయి. రష్యాపై మరిన్ని కఠినమైన ఆంక్షలు విధించాలని జీ7 దేశాలను జెలెన్ స్కీ కోరారు. అదే సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలను మళ్లీ తోసిపుచ్చారు.
Ukraine
Russia
g7 nations
warning
Vladimir Putin

More Telugu News