T20 World Cup: సిరాజ్ కు లక్కీ చాన్స్.. టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియాకు హైదరాబాదీ

Deepak Chahar ruled out Mohammed Shami Siraj and Shardul Thakur to fly out to Australia
  • రేపు షమీ, శార్దూల్ ఠాకూర్ తో కలిసి పెర్త్ కు ప్రయాణం
  • బుమ్రా స్థానంలో జట్టులోకి ఈ ముగ్గురికి చాన్స్ 
  • గాయంతో మెగా టోర్నీ నుంచి తప్పుకున్న దీపక్ చాహర్ 
టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉన్న భారత జట్టుకు మరో షాక్ తగిలింది. యువ పేసర్ దీపక్ చాహర్ గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. ప్రపంచకప్ స్టాండ్ బై జాబితాలో ఉన్న చాహర్ సభ్యుడిగా ఉన్నాడు. స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా స్థానంలో అతడిని తుది జట్టులోకి తీసుకుంటారని భావించారు. కానీ, దక్షిణాఫ్రికాతో మొదటి వన్డేకు ముందు అతని చీలమండకు గాయమైంది. వెన్ను నొప్పి కూడా రావడంతో ఈ సిరీస్ నుంచి తప్పించి బెంగళూరులోని జాతీయ  క్రికెట్ అకాడమీకి తీసుకెళ్లారు. గాయం తగ్గకపోవడం, ఫిట్ నెస్ సమస్యల వల్ల టీ20 ప్రపంచ కప్ నుంచి కూడా అతడిని తప్పించారు. 

చాహర్ దూరమైన నేపథ్యంలో మరో రిజర్వ్ ప్లేయర్ మహమ్మద్ షమీతో పాటు మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌ గురువారం ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. జట్టులో బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే విషయంలో ముందంజలో ఉన్న షమీ కరోనా బారిన పడి కోలుకున్నాడు. ఆసీస్ వెళ్లే ముందు అతను ఎన్సీఏలో ఫిట్ నెస్ పరీక్షకు హాజరవుతాడు. ఇందులో పాస్ అయితే సిరాజ్, శార్దూల్ తో పాటు పెర్త్ చేరుకొని భారత జట్టుతో కలుస్తాడు. మరోవైపు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన సిరాజ్ కూడా బుమ్రాకు రీప్లేస్ మెంట్ గా తెరపైకి వచ్చాడు. తను కొత్త బంతితో అద్భుతమైన రిథమ్‌లో ఉన్నాడు. మంచి బౌన్సర్లు సంధిస్తూ పరుగులు నియంత్రిస్తున్నాడు. 

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా చేరుకున్న వెంటనే ఈ ముగ్గురినీ పరీక్షించి బుమ్రా స్థానాన్ని భర్తీ చేయాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. షమీ ముందు వరుసలో ఉన్నా..  ప్రస్తుత ఫామ్ దృష్ట్యా సిరాజ్ కూడా జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనీసం రిజర్వ్ ప్లేయర్ గా అయినా అతనికి చాన్స్ దక్కొచ్చు. అదే జరిగితే హైదరాబాద్ యువ పేసర్ తొలిసారి ఓ ప్రపంచ కప్ జట్టులో ఉంటాడు.
T20 World Cup
Team India
Australia
Mohammed sirajhmed
shami
shardul

More Telugu News