Man: లేటుగా వచ్చాడంటూ డెలివరీ బాయ్ కి‌ హారతి... అది తప్పు అంటూ డెలివరీ బాయ్​ ఫిర్యాదు!

  • డెలివరీ బాయ్ కు బొట్టుపెట్టి ‘ఆయియే ఆప్ కా ఇంతెజార్ థా’ అంటూ పాట పాడిన వ్యక్తి
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో.. మద్దతుగా కొందరు, విమర్శిస్తూ మరికొందరు కామెంట్లు
  • కస్టమర్ ఆరోపణలు తప్పు అంటూ.. తన ఆర్డర్ డెలివరీ స్క్రీన్ షాట్ ట్విట్టర్ లో పెట్టిన డెలివరీ బాయ్
Man greets zomato delivery boy with aarti

బాగా ఆకలిగా ఉంది.. ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేశాం.. రెస్టారెంట్ వాళ్లు ఫుడ్ సిద్ధం చేశారు. డెలివరీ బాయ్ వెళ్లి దానిని తీసుకుని, మనకు తెచ్చివ్వాలి. కానీ వెళ్లి ఫుడ్ తీసుకోవడంలో, మనకు తెచ్చివ్వడంలో ఆలస్యం చేస్తే.. అదీ గంటపాటు లేట్ చేసి, ఫుడ్ అంతా చల్లారిపోతే.. చిర్రెత్తుకొస్తుంది కదా. అయితే ఆర్డర్ క్యాన్సిల్ చేస్తుంటాం. లేకుంటే డెలివరీ బాయ్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంటాం. కానీ ఢిల్లీలో మాత్రం ఒకాయన చాలా చిత్రంగా నిరసన తెలిపాడు.

హెల్మెట్ తీయించి మరీ..
ఢిల్లీలో తాను ఆర్డర్ చేసిన ఫుడ్ ను ఆలస్యంగా తెచ్చి ఇచ్చాడంటూ ఓ వ్యక్తి ఇటీవల జొమాటో డెలివరీ బాయ్ కు ఓవ్యక్తి చిత్రంగా నిరసన తెలిపాడు. డెలివరీ బాయ్ రాగానే.. హెల్మెట్ తీయాలని కోరాడు. హెల్మెట్ తీశాక బొట్టు పెట్టి, హారతి ఇచ్చాడు. ఆ తర్వాత అక్షింతలు కూడా వేశాడు. ఈ సమయంలో ‘ఆయియే ఆప్‌ కా ఇంతెజార్‌ థా’ అంటూ పాట కూడా పాడాడు. ఇదేమీ సరిగా అర్థంకాని డెలివరీ బాయ్.. ఆ వ్యక్తి చెప్పినట్టు చేయడం గమనార్హం.

  • దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన వీడియోను 50 లక్షల మందికిపైగా చూశారు. ట్విట్టర్, ఫేస్ బుక్ లలోనూ ఆ వీడియో తెగ చెక్కర్లు కొట్టేస్తోంది. విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి.
  • ‘‘డెలివరీ బాయ్ నిర్లక్ష్యానికి భలే నిరసన తెలిపాడు’’ అని కొందరు అంటుంటే.. ‘‘పాపం.. రెస్టారెంట్ వద్ద ఎంత లైన్ ఉందో, రోడ్డు మీద ట్రాఫిక్ ఎంత ఉందో.. కావాలని లేట్ చేస్తాడా, ఈ ఆర్డర్ డెలివరీ చేస్తే మరో ఆర్డర్ వస్తుందికదా..” అని మరికొందరు సమర్థిస్తున్నారు.

కస్టమర్ ఆరోపణలు తప్పు..
అయితే సదరు వ్యక్తి తనపై తప్పుడు ఆరోపణలు చేశాడని, నిజానికి తాను సరైన సమయంలోనే డెలివరీ చేశానని జొమాటో డెలివరీ బాయ్ అశీష్ ఝా స్పష్టం చేశారు. ఆ రోజున తాను డెలివరీ చేసిన ఆర్డర్ కు సంబంధించిన టైమ్ స్క్రీన్ షాట్ ను కూడా షేర్ చేశాడు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ జొమాటో కేర్ ఖాతాను ట్యాగ్ చేశాడు. ఆ ట్వీట్ పై స్పందించిన జొమాటో సంస్థ.. దీనిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.

జొమాటో డెలివరీ బాయ్ విషయంలో తప్పుడు ఆరోపణలతో వీడియో పెట్టినవారిపై విమర్శలు వస్తున్నాయి. వారిపై లీగల్ గా చర్యలు చేపట్టాలని నెటిజన్లు జొమాటోకు సూచిస్తుండటం గమనార్హం.

More Telugu News