Rajendra Pal Gautam: మతమార్పిడి వివాదంలో చిక్కుకున్న ‘ఆప్’ మంత్రి రాజీనామా

Rajendra Pal Gautam resigns from Delhi Cabinet amid row over conversion event
  • మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రిపై బీజేపీ విమర్శలు
  • తన రాజీనామా పత్రాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసిన రాజేంద్ర పాల్
  • బీజేపీ నీచ రాజకీయాలకు నిరసనగానే అన్న ‘ఆప్’ నేత
ఇటీవల మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొన్న ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ ఢిల్లీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ తన పదవికి రాజీనామా చేశారు. మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఓ వర్గం వారి మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపిస్తూ బీజేపీ, వీహెచ్‌పీలు మంత్రిపై విరుచుకుపడ్డాయి. మత మార్పిడి కార్యక్రమంలో ఏకంగా ఓ మంత్రి పాల్గొనడం సిగ్గు చేటని విమర్శించాయి. అంతేకాదు, ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. విమర్శల సుడిగుండంలో చిక్కుకున్న రాజేంద్రపాల్ గౌతమ్ నిన్న తన పదవికి రాజీనామా చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు తాను సంకెళ్ల నుంచి విముక్తి పొందానని అన్నారు. ఈ రోజు తాను మళ్లీ పుట్టానని, ఇకపై ఎలాంటి ఆంక్షలు లేకుండా హక్కుల కోసం, సమాజంపై జరిగే దౌర్జన్యాల విషయంలో మరింత గట్టిగా పోరాడతానని అన్నారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు. అంతేకాదు, ఇటీవలి వ్యవహారంలో బీజేపీ తనతోపాటు కేజ్రీవాల్‌ను కూడా లక్ష్యంగా చేసుకోవడం బాధాకరమన్నారు. బీజేపీ నీచ రాజకీయాలకు నిరసనగానే తన పదవికి రాజీనామా చేసినట్టు రాజేంద్ర పాల్ గౌతమ్ పేర్కొన్నారు.
Rajendra Pal Gautam
AAP Leader
Delhi Cabinet
Arvind Kejriwal

More Telugu News