Shashi Tharoor: మా ఇద్దరికీ గాంధీ కుటుంబ సభ్యుల ఆశీస్సులు ఉన్నాయి: శశి థరూర్

Shashi Tharoor says he and Kharge have Gandhi family blessings
  • త్వరలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు
  • గాంధీ కుటుంబానికి తాను, ఖర్గే ఒకటేనన్న థరూర్
  • ఎవరిపైనా వారికి పక్షపాతం లేదని వెల్లడి
అక్టోబరు 17న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనుండగా, ప్రధాన అభ్యర్థులు శశి థరూర్, మల్లికార్జున ఖర్గే ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగితేలుతున్నారు. ఈ నేపథ్యంలో, ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు, ఖర్గేకు... ఇద్దరికీ గాంధీ కుటుంబ సభ్యుల ఆశీస్సులు ఉన్నాయని వెల్లడించారు. తామిద్దరిలో ఎవరిపైనా వారికి పక్షపాత ధోరణి లేదని అన్నారు. 

మహారాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశం అనంతరం శశి థరూర్ మాట్లాడుతూ, తాను, ఖర్గే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నామన్న సంగతి గాంధీ కుటుంబ సభ్యులు గుర్తించారని పేర్కొన్నారు.

ఈ ఎన్నికలు ఓ అధికారిక అభ్యర్థి (ఖర్గే), ఓ అనధికార అభ్యర్థి (థరూర్)కు మధ్య పోటీ అని జరుగుతున్న ప్రచారాన్ని థరూర్ ఖండించారు. "నేను గాంధీ కుటుంబ సభ్యులతో మాట్లాడినంతవరకు, వారు ఏ ఒక్కరివైపో మొగ్గు చూపడంలేదన్న విషయం స్పష్టమైంది. వారి దృష్టిలో నేను గానీ, ఖర్గే గానీ ఒక్కటే" అని థరూర్ వివరించారు.
Shashi Tharoor
Mallikharjuna Kharge
Gandhi Family
Congress
President
Elections

More Telugu News