Maharashtra: భవిష్యత్తుకు భరోసా.. రాత్రి 7 గంటలకు ఆ ఊర్లో టీవీలు, సెల్‌ఫోన్లు బంద్!

Phones and TVs have to be kept aside in the evening  innovative decision of the village sarpanch
  • ఆన్‌లైన్ క్లాసులకు పిల్లలకు స్మార్ట్ ఫోన్లు కొనిచ్చిన తల్లిదండ్రులు
  • వాటికి బానిసలైపోయి చదువును చెట్టెక్కించేస్తున్న విద్యార్థులు
  • పిల్లల భవిష్యత్ నాశనం కాకుండా సర్పంచ్ వినూత్న నిర్ణయం
  • రాత్రి ఏడు గంటలు కాగానే సైరన్ మోత
  • ఆ వెంటనే సెల్‌ఫోన్లు సిచ్చాఫ్.. మూగబోతున్న టీవీలు
కరోనా సమయంలో ఆన్‌లైన్ క్లాసుల పుణ్యమా అని పిల్లలకు తల్లిదండ్రులు సెల్‌ఫోన్లు కొనిచ్చారు. ఆన్‌లైన్ విద్యకు అవి ఎంతవరకు ఉపయోగపడ్డాయో తెలియదు కానీ, ఆ తర్వాత సెల్‌ఫోన్లకు పిల్లలు బానిసలయ్యారు. పెద్దల మాటలు పెడచెవిన పెట్టి మరీ వాటికి అతుక్కుపోతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే పిల్లల భవిష్యత్ నాశనం అయిపోతుందని భావించిన మహారాష్ట్ర సంగ్లీ జిల్లాలోని ఓ గ్రామం వినూత్న నిర్ణయం తీసుకుంది. అదిప్పుడు సత్ఫలితాలను ఇస్తోంది.

కాడేగావ్ మండలంలోని మోహిత్యాంచె వడ్గావ్ గ్రామ జనాభా 3,105. లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ పాఠాలు వినేందుకు పిల్లలకు తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్లు కొనిచ్చారు. అంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఎప్పుడు చూసినా పిల్లలు మొబైల్ ‌ఫోన్‌తోనే కనిపించడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు, మహిళలేమో పిల్లల గురించి పట్టించుకోకుండా టీవీ సీరియళ్లు చూడడంలో మునిగిపోయేవారు. ఇది ఇలాగే కొనసాగితే ప్రమాదమని, పిల్లల భవిష్యత్ నాశనమవుతుందని గ్రామ సర్పంచ్ విజయ్ మోహితే భావించారు. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. 

అందులో భాగంగా ఆగస్టు 15న గ్రామంలోని మహిళలు అందరితో సమావేశమయ్యారు. రోజూ రాత్రి 7 గంటల నుంచి 8.30 గంటల మధ్య టీవీలు, సెల్‌ఫోన్లు ఆఫ్ చేయాలని తీర్మానించారు.  ఈ నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యతను ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పంచాయతీ సభ్యులకు అప్పగించారు. అప్పటి నుంచి రోజూ రాత్రి ఏడు గంటలు కాగానే సైరన్ మోగుతుంది. అంతే సెల్ఫ్‌ఫోన్లు ఆఫ్ అయిపోతాయి. టీవీలు మూగబోతాయి. పిల్లలు శ్రద్ధగా హోం వర్కులు చేసుకుంటారు. మహిళలు ఇంటి పనులు చూసుకుంటారు. ఈ విషయంలో గ్రామస్థులు తొలుత ఇబ్బంది పడినా ఆ తర్వాత మాత్రం దీనికి అలవాటు పడిపోయారు. విషయం తెలిసిన చుట్టుపక్కల జిల్లాల వారు సర్పంచ్ విజయ్ మోహితే నిర్ణయాన్ని కొనియాడుతున్నారు.
Maharashtra
Mohityanche Vadgaon
Kadegaon
Smarrt Phones
TVs

More Telugu News