Cough Medicine: మీ పిల్లలకు దగ్గు మందు తాగిస్తున్నారా..? జాగ్రత్త.. !

  • వీటితో చిన్నారులకు తీవ్ర దుష్ప్రభావాలు
  • ప్రాణాంతకం కావచ్చు..
  • వైద్య నిపుణుల హెచ్చరిక
  • ఇవి పనిచేస్తాయనడానికి ఆధారాల్లేవంటున్న అధ్యయనాలు
  • పెద్ద పిల్లలు, పెద్దలకు రిస్క్ తక్కువే
Cough Medicine Should You or Shouldnot You

మీ పిల్లలకు తరచూ దగ్గు మందు పట్టిస్తుంటారా..? అయితే మీరు ఇక మీదట అలా చేయకుండా ఉంటేనే మంచిది. కేవలం వైద్యులు సూచించిన దగ్గు మందును, సూచించినన్ని రోజుల వరకే వాడుకోండి. అంతేకానీ, సొంతంగా ఫార్మసీ స్టోర్ నుంచి కొనుగోలు చేసి దగ్గు, జలుబు మందులు వాడుకోవడం ఏ మాత్రం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. పలు అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. 


మార్కెట్లో ప్రమాణాలు లేని ఔషధాల విక్రయాలు పెరిగిపోయాయి. మన దేశానికి చెందిన మెయిడన్ ఫార్మస్యూటికల్ కంపెనీ తయారు చేసిన నాలుగు రకాల దగ్గు, జలుబు మందులు తాగి గాంబియా దేశంలో 66 మంది చిన్నారులు మృతి చెందడంతో.. ఈ ఔషధాలపై మరోసారి చర్చ మొదలైంది. అంతకుముందు 2020 ఫిబ్రవరిలో జమ్మూ కశ్మీర్ లోనూ ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. ఉదంపూర్ జిల్లాలో జలుబు మందు సేవించి తొమ్మిది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఓ ఫార్మా కంపెనీ వీటిని తయారు చేసింది. ఈ మందులోనూ, ఇప్పుడు గాంబియా దేశంలో చిన్నారులు సేవించిన మందుల్లోనూ డైఎథిలేన్ గ్లైకాల్ అనే పదార్థం అధిక మోతాదుల్లో (ఆమోదనీయం కాని స్థాయి) ఉన్నట్టు వెలుగు చూసింది. 

సూచనీయం కాదు
అసలు ఈ దగ్గు, జలుబు మందులు అంతగా వాడుకపోవడమే మంచిదని ఎక్కువ మంది నిపుణుల సూచన. దగ్గు సిరప్ ఆరోగ్యానికి చేటు చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు ఇది మరింత హాని చేస్తుందని చెబుతున్నారు. దుమ్ము, ధూళి వల్ల పిల్లల్లో దగ్గు వస్తుందని, దానిని సహజ విధానంలో నయం చేయాలి తప్పితే, దగ్గు సిరప్ వాడాలంటూ వైద్యులు సిఫారుసు చేయడం మానుకోవాలని చిన్న పిల్లల డాక్టర్డా సతీష్ డియో పుజారి సూచించారు. అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే దగ్గు మందును నిషేధించినట్టు గుర్తు చేశారు.

దగ్గు ద్రావణంలో ఉండే మత్తు వల్ల గుండె కొట్టుకునే రేటు పెరుగుతుందని డాక్టర్ సతీష్ తెలిపారు. పిల్లల శ్వాస ప్రక్రియపై విపరీత ప్రభావం చూపిస్తుందని వివరించారు. దగ్గు సిరప్‌ను పిల్లలు వాడడం అత్యంత ప్రమాదకరమని మరో వైద్యుడు డాక్టర్ ముజావార్ సైతం తెలిపారు.

ఆధారాల్లేవు..
డెక్స్ ట్రో మెథార్ఫన్, గైఫెన్సిన్ తదితర ఇంగ్రేడియంట్స్ ముక్కులోని కళ్లెను పలుచన చేస్తాయని, వైద్యులు సూచిస్తుంటారు. కానీ, ఇవి దగ్గు, జలుబును తగ్గిస్తాయనడానికి రుజువులు లేవని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. దగ్గు, జలుబు మందులు పనిచేస్తాయనడానికి బలమైన ఆధారాలు లేనందున వాటిని సూచించకపోవడమే మంచిదని యూఎస్ ఎఫ్ డీఏ సైతం 2008లో సూచన జారీ చేసింది. వీటి కారణంగా తీవ్రమైన దుష్ప్రభావాలు ఉన్నట్టు గుర్తు చేసింది. ఆరేళ్లలోపు పిల్లలకు దగ్గు, జలుబు మందులు సూచించాల్సిన అవసరం లేదని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సైతం సూచించింది.

డెక్స్ ట్రో మెథార్ఫన్ ను మోతాదుకు మించి వాడుకోకూడదు. మోతాదు మించితే చిత్ర భ్రమలకు దారితీస్తుంది. బ్యాలన్స్ కోల్పోతారు. శ్వాసతీసుకోవడం కష్టమవుతుంది. తీవ్రమైన గుండె సమస్యలకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. 

‘‘దగ్గుతో అస్వస్థతకు గురైనప్పుడు ఉపశమనం కోసం ఏదైనా చేస్తుంటాం. తగ్గుతుందన్న అభిప్రాయంతో మందు కూడా వాడతాం. దగ్గు మందు తీసుకున్న కొన్ని రోజులకు కొంత ఉపశమనం కనిపిస్తుంది. దీంతో ఇది పనిచేసిందని అనుకుంటారు. కానీ దగ్గు దానంతట అదే పోతుంది. దీనికి దగ్గు ముందు చేసింది పెద్దగా ఏమీ ఉండదు’’అని అమెరికన్ లంగ్ అసోసియేషన్ సీనియర్ సైంటిఫిక్ అడ్వైజర్, ఎండీ నార్మన్ ఎడెల్ మాన్ వివరించారు.

ఇప్పటి వరకు ఉన్న అధ్యయనాలు, వైద్యుల అనుభవాల ప్రకారం దగ్గు, జలుబు మందులతో చిన్నారుల్లో తీవ్ర దుష్ప్రభావాలకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. కానీ, పెద్ద పిల్లలు (12 ఏళ్లు అంతకంటే ఎక్కువ), పెద్దల్లో వీటితో పెద్ద దుష్ఫ్రభావాలు ఉండవని నార్మన్ ఎడెల్ మాన్ పేర్కొన్నారు.

More Telugu News