Priyanka Chopra: మ‌న‌మిద్దరం భార‌త బిడ్డ‌లం.. అమెరికా ఉపాధ్య‌క్షురాలితో ప్రియాంకా చోప్రా

Priyanka Chopra tells US Vice President Kamala Harris we are daughters of India
  • క‌మ‌లా హారిస్ ను ఇటీవ‌ల ఇంటర్వ్యూ చేసిన న‌టి
  • భారతీయ సంబంధాలు, వివాహ సమానత్వం, వాతావరణ మార్పుపై చ‌ర్చ‌
  • అమెరికాలో జీవించ‌డం క‌ల‌గా భావిస్తున్నాన‌న్న ప్రియాంకా చోప్రా
బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగి హాలీవుడ్‌లోనూ స‌త్తా చాటుతున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇటీవల అగ్ర‌రాజ్యం అమెరికా ఉపాధ్య‌క్షురాలు కమలా హారిస్‌తో వేదికను పంచుకుంది. క‌మాల్ హారిస్‌ను ఇంట‌ర్వ్యూ చేసి ఆక‌ట్టుకుంది. డెమొక్రాటిక్ నేషనల్ కమిటీకి చెందిన విమెన్ లీడర్‌షిప్ ఫోరమ్ ప్రియాంకకు ఈ అవ‌కాశం క‌ల్పించింది. దీన్ని చ‌క్క‌గా సద్వినియోగం చేసుకున్నచోప్రా.. భార‌త సంత‌తికి చెందిన క‌మ‌లా హారిస్‌తో మంచి ఇంట‌ర్వ్యూ చేసింది. భారతీయ సంబంధాలు, వివాహ సమానత్వం, వాతావరణ మార్పు త‌దిత‌ర అంశాల‌ను నటి స్పృశించింది. ఇద్దరికీ కామ‌న్‌ క‌నెన్ష‌న్ అయిన భార‌త్ తో ఆమె ముఖాముఖీని ప్రారంభించింది. "ఒక విధంగా మ‌న‌మిద్ద‌రం భారత బిడ్డలమని నేను భావిస్తున్నాను" అని కమలా హారిస్‌తో ప్రియాంక చోప్రా చెప్పింది. 

“మీరు ఒక భారతీయ తల్లి, ఒక జమైకన్ తండ్రికి అమెరికాలో జన్మించిన గర్వించదగిన కుమార్తె. నేను ఇద్దరు వైద్యులకు పుట్టిన ఇండియ‌న్‌ను. ఈ దేశానికి (అమెరికా) ఇటీవలే వలస వచ్చిన వ్యక్తిని. అమెరికాలో నివ‌సించ‌డం ఒక క‌ల అని ఇప్ప‌టికీ విశ్వ‌సిస్తున్న వ్య‌క్తిని నేను” అని ప్రియాంక వ్యాఖ్యానించింది. ఈ ప్ర‌పంచం మొత్తం అమెరికాను స్వేచ్ఛ, నమ్మకానికి ఒక దీప స్తంభంగా చూస్తోందని... యావత్ ప్రపంచానికి ఒక ఎంపికగా అమెరికా ఉందని ప్రియాంక చెప్పింది. ఒక నటిగా 20 ఏళ్లకు పైగా పనిచేసిన తర్వాత, ఈ ఏడాది మాత్రమే తనకు పురుష నటులతో సమానంగా వేతనం లభించిందని చెప్పింది. 

ఇంతలో, కమలా హారిస్ క‌ల్పించుకొని తాము స్థిరపడని ప్రపంచంలో జీవిస్తున్నామని అంగీకరించారు. తాము గ‌తంలో తీసుకున్న నిర్ణ‌యాలపై ఇప్పుడు అన‌వ‌స‌ర చ‌ర్చ‌, ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. దీనికి ఉక్రెయిన్‌, ర‌ష్యా యుద్ధ‌మే ఉదాహ‌ర‌ణ అన్నారు. ఇరు దేశాల సమస్య చాలా చక్కగా పరిష్కరించవ‌చ్చ‌ని తాము అనుకున్నామ‌ని చెప్పారు. కానీ, ఇప్పుడు అక్క‌డ ఏం జ‌రుగుతుందో అంతా చూస్తున్నార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.
Priyanka Chopra
USA
Kamala Harris
interview
Bollywood
Hollywood

More Telugu News