Kerala: కేరళలో ‘దృశ్యం’.. బావమరిదిని చంపి ఇంట్లో పాతిపెట్టి ఫ్లోరింగ్ చేసిన బావ!

Drishyam model murder in Kerala Man concretes floor after dumping brother in law s body
  • వారం రోజుల క్రితం అదృశ్యమైన బిందుకుమార్
  • రోడ్డు ప్రమాదంలో చనిపోయి ఉంటాడని తొలుత భావించిన పోలీసులు
  • చివరి ఫోన్ కాల్ ఆధారంగా బాధితుడి బావ ఇంటికి వెళ్లిన పోలీసులు
  • ఇంట్లోని గచ్చు కొత్తగా ఉండడంతో అనుమానం
  • అరగంట పాటు తవ్విన తర్వాత లభ్యమైన మృతదేహం
కేరళలో నిజమైన ‘దృశ్యం’ సినిమా ఆవిష్కృతమైంది. ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అతడి మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టి చక్కగా ఫ్లోరింగ్ చేసేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. కొట్టాయం జిల్లాకు చెందిన బిందు కుమార్ (40) వారం రోజుల క్రితం అలప్పుళలో అదృశ్యమయ్యాడు. అతడి కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతడి ఫోన్ కాల్స్‌ను పరిశీలించారు. 

బిందు కుమార్ చివరిసారిగా కొట్టాయం జిల్లా చంగనేస్సరికి చెందిన ముత్తుకుమార్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు గుర్తించారు. దీంతో అతడిని వెతక్కుంటూ చంగనేస్సరిలోని ఆయన ఇంటికి వెళ్లారు. ఇంట్లో అతడు లేకపోవడంతో చుట్టుపక్కల వారిని పోలీసులు ఆరా తీశారు. ఆయన ఇంట్లో కొన్ని రోజులుగా మరమ్మతులు జరుగుతున్నాయని ఇరుగుపొరుగు వారు చెప్పడంతో అనుమానించి ఇంట్లోకి వెళ్లి చూశారు. ఇంట్లోని గచ్చు కొత్తగా ఉండడంతో దానిని బద్దలు కొట్టించి తవ్వించారు. అరగంటపాటు తవ్విన తర్వాత వారికి ఓ గోనె సంచి కనిపించింది. దానిని వెలికి తీసి చూసిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఆ గోనె సంచిలో బిందు కుమార్ మృతదేహం ఉంది. వెంటనే ఆ మృతదేహాన్ని పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ముత్తుకుమార్ కోసంపోలీసులు గాలిస్తున్నారు. 

ముత్తుకుమార్.. బిందుకుమార్‌ చెల్లెల్లి భర్త కావడం గమనార్హం. కాగా, పోలీసులు తొలుత బిందుకుమార్ మోటార్ సైకిల్‌ని కొట్టాయంలోని వకతానమ్ గ్రామంలో గుర్తించారు. దీంతో ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించి ఉంటాడని భావించారు. అయితే, ఆ గ్రామంలో తమ అల్లుడు ఉంటాడని బాధితుడి తల్లి చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్య వెనక గల కారణం ఏంటన్నది తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Kerala
Drishyam Movie
Murder
Crime News

More Telugu News