everyday: ఈ రోజువారీ అలవాట్లు.. మధుమేహానికి దగ్గరి దారులు

  • కదలికల్లేని జీవనశైలితో అధిక ముప్పు
  • కార్బోహైడ్రేట్లను తగ్గించుకోవాలి
  • తగినంత సమయం నిద్ర పోవాలి
  • కూల్ డ్రింక్స్, పొగతాగడానికి దూరంగా ఉండాలి
5 everyday bad habits that can lead to diabetes

నేటి తరానికి జీవనశైలి వ్యాధుల రిస్క్ ఎక్కువ. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, ఎముకలు బలం కోల్పోవడం ఇవన్నీ జీవనశైలి మార్పులతో పెరిగిపోయినవే. రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోతే అది మన శరీరంపై ఎంతో ప్రభావం పడేలా చేస్తుంది. జన్యు సంబంధిత లేదా ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు లేకపోవడం మధుమేహానికి దారితీయవచ్చు. ముఖ్యంగా తాము మధుమేహం బారిన పడకూడదని కోరుకునే వారు.. ఈ అలవాట్లను దూరంగా పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది.

ఒకే చోట తిష్ట
కదలకుండా గంటల తరబడి ఒకే చోట కూర్చునే వారికి మధుమేహం రిస్క్ ఎక్కువ. కుర్చీల్లో కూర్చుని పనిచేసే వారికి మానసిక శ్రమ తప్పించి, శారీరక శ్రమ ఉండదు. కనుక ఇది మన జీవక్రియలకు మంచిది కాదు. మధ్య మధ్యలో అటూ ఇటూ కదలికలు ఉండేలా చూసుకోవాలి. కూర్చుని పనిచేయాల్సిన వారు కూడా అరగంటకోసారి అయినా 2 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. రోజులో కనీసం అరగంట అయినా వ్యాయామాలతో నిశ్చల జీవనానికి పనిచెప్పడం ద్వారా, టైప్2 మధుమేహం వచ్చే రిస్క్ ను తగ్గించొచ్చు.

కార్బోహైడ్రేట్లు..
మన భారతీయ ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ. వీటివల్ల ప్రయోజనాలు ఉన్నాయి. నష్టాలు కూడా ఉన్నాయి. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లకు బదులు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లకు స్థానం కల్పించుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కనుక బియ్యానికి బదులు బ్రౌన్ రైస్ తీసుకోవాలి. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు రక్తంలో గ్లూకోజ్ ను వేగంగా పెంచేస్తాయి. మైదా వాడుకోవద్దు. వైట్ బ్రెడ్ బదులు హోల్ వీట్ బ్రెడ్ తీసుకోవచ్చు. 

తగినంత నిద్ర
అధిక వేళలు పనిచేయాల్సి రావడం, ఒత్తిళ్లు పెరిగిపోవడం తదితర కారణాలతో నేడు నిద్రా సమయం తగ్గిపోయింది. 8 గంటల నిద్ర పోయే వారితో పోలిస్తే కొన్ని గంటలే నిద్రించే వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. అంతేకాదు, నిద్ర తక్కువగా కొన్నేళ్ల పాటు కొనసాగితే మధుమేహం పలకరిస్తుంది. హార్మోన్ల పనితీరు గాడి తప్పుతుంది. కనుక నిద్రను నిర్లక్ష్యం చేయకూడదు.

పానీయాలు
కార్బోనేటెడ్ (కూల్ డ్రింక్స్) డ్రింక్స్ చాలా ప్రమాదకరం. వీటిని తీసుకోవద్దు. వీటికి బదులు పండ్ల రసాలు, కొబ్బరి నీరు తాగొచ్చు. పండ్ల రసాల్లోనూ పంచదార వేసుకోవద్దు. ఎంత ఎండా కాలం అయినా సరే నిమ్మ సోడాకు పరిమితం కావాలి. 

పొగతాగడం
పొగతాగడం వల్ల మొదట కొన్నేళ్ల పాటు సమస్యలు ఉండకపోవచ్చు. కానీ, దీర్ఘకాలంలో పొగతాగే వారు మధుమేహం బారిన పడతారని పలు అధ్యయనాలు తేల్చాయి. పొగతాగని వారితో పోలిస్తే పొగతాగే వారు 40 శాతం అధికంగా టైప్ 2 మధుమేహం బారిన పడే రిస్క్ ఉంటుందట. 

More Telugu News