Smugglers: పోలీసు జాగిలాలను ఏమార్చడానికి డ్రగ్స్ స్మగ్లర్ల కొత్త ఎత్తుగడ

Drugs smugglers new tactic to escape from Police Dogs in airports
  • సాధారణ కొకైన్ లో బ్లాక్ కొకైన్ మిక్స్
  • వాసన లేని కొకైన్ తయారు
  • కొకైన్ ను పసిగట్టడంలో జాగిలాలు విఫలం
  • ఇటీవల ఇద్దరు విదేశీయుల అరెస్ట్
  • విచారణలో ఆసక్తికర అంశాల వెల్లడి
ఒక కిలో కొకైన్ కోట్ల రూపాయల ధర పలుకుతుంది. అందుకే ప్రాణాలకు తెగించి మరీ డ్రగ్స్ స్మగ్లర్లు కొకైన్ అక్రమ రవాణా చేస్తుంటారు. తద్వారా కొద్దిసమయంలో కోటీశ్వరులు అయ్యేందుకు అక్రమ మార్గాల్లో పయనిస్తుంటారు. 

భారత్ కు ప్రధానంగా దక్షిణ అమెరికా దేశాల నుంచి డ్రగ్స్ అక్రమ రవాణా అవుతుంటాయి. స్మగ్లర్లు ఎంతో పకడ్బందీగా డ్రగ్స్ తీసుకువచ్చినా విమానాశ్రయాల్లో పోలీసు జాగిలాల కారణంగా దొరికిపోతుంటారు. శిక్షణ పొందిన జాగిలాలు ఎయిర్ పోర్టులో వాసన చూసి కొకైన్ వంటి డ్రగ్స్ ను గుర్తించగలవు. 

అయితే, డ్రగ్స్ స్మగ్లర్లు ఇప్పుడు కొత్త ఎత్తుగడ అమలు చేస్తున్నారని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) వెల్లడించింది. సాధారణ కొకైన్ లో బ్లాక్ కొకైన్, మరికొన్ని రసాయనాలు కలుపుతున్నారని తెలిపింది. తద్వారా ఆ కొకైన్ కు ఎలాంటి వాసన ఉండదని, దాంతో పోలీసు జాగిలాలు ఆ కొకైన్ ను గుర్తించలేవని ఎన్సీబీ వివరించింది. ఈ విధంగా స్నిఫర్ డాగ్స్ ను స్మగ్లర్లు ఏమార్చుతున్నారని పేర్కొంది. 

ముంబయిలో ఓ బొలీవియా మహిళను అరెస్ట్ చేసిన తర్వాత ఈ బ్లాక్ కొకైన్ గురించి తెలిసింది. బొలీవియా దేశస్తురాలి నుంచి డ్రగ్స్ అందుకోవాల్సిన నైజీరియా జాతీయుడ్ని గోవాలో అరెస్ట్ చేశారు. వారిని విచారించగా, పోలీసు జాగిలాలకు దొరక్కుండా డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేందుకు బ్లాక్ కొకైన్ వినియోగిస్తున్న విషయం వెల్లడించారు.
Smugglers
Black Cocaine
Sniffer Dogs
Airports
NCB
India

More Telugu News