India: భార‌త ఫుట్‌బాల్ కెప్టెన్ ఛెత్రికి అరుదైన గౌర‌వం

Prime Minister Narendra Modi hails Sunil Chhetri after FIFA releases 3 episode series on football captain
  • ఛెత్రి జీవితంపై డాక్యుమెంట‌రీ రూపొందించిన ఫిఫా
  • మూడు ఎపిసోడ్‌ల సిరీస్ విడుద‌ల‌
  • హ‌ర్షం వ్య‌క్తం చేసిన ప్ర‌ధాన మంత్రి  న‌రేంద్ర మోదీ
భార‌త ఫుట్‌బాల్ జ‌ట్టు కెప్టెన్ సునీల్‌ ఛెత్రికి అరుదైన గౌర‌వం ల‌భించింది. అత‌ని జీవితం, కెరీర్‌పై ప్రపంచ ఫుట్‌బాల్ స‌మాఖ్య (ఫిఫా) ప్ర‌త్యేక డాక్యుమెంటరీని రూపొందించింది. మూడు ఎపిసోడ్‌ల ఈ డాక్యుమెంట‌రీని తాజాగా విడుద‌ల చేసింది. 

ఇందులో ఆట‌గాడిగా ఛెత్రి సాధించిన విజయాలతో పాటు భార‌త జ‌ట్టులోకి రావడానికి అత‌ను పడిన కష్టాలను కళ్లకు కట్టింది. ‘కెప్టెన్‌ ఫెంటాస్టిక్‌’ పేరుతో రూపొందించిన‌ ఈ డాక్యుమెంటరీ త‌న అధికారిక స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ అయిన‌  ఫిఫా లో అందుబాటులో ఉంచింది. ‘దిగ్గ‌జ ఫుట్ బాట‌ర్లు క్రిస్టియానో రొనాల్డో, లియోన‌ల్‌ మెస్సీ గురించి మీ అంద‌రికీ తెలుసు. ఇప్పుడు అత్యధిక అంత‌ర్జాతీయ గోల్స్ సాధించిన మూడో ఆటగాడి గురించి  కూడా తెలుసుకోండి’ అని ఫిఫా పేర్కొన్న‌ది.

సాధార‌ణంగా ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన ఆట‌గాళ్ల గురించి ఫిఫా ఇలాంటి డాక్యుమెంట‌రీలు చేస్తుంటుంది. ఛెత్రిపై ఇలాంటి ఎడిసోడ్ చేసిందంటే అది చాలా  గొప్ప విష‌యం. ఇది ఛెత్రితో పాటు భార‌త ఫుట్‌బాల్ కు కూడా గ‌ర్వ‌కార‌ణం అనొచ్చు. దీనిపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ స్పందించారు. ఛెత్రిని అభినందించిన మోదీ.. భార‌త్ లో ఫుట్ బాల్ మ‌రింత‌గా ప్రాచుర్యం చెందేందుకు ఇది దోహ‌ద‌ప‌డుతుంద‌ని ట్వీట్ చేశారు.

2005లో భార‌త్‌ తరఫున అరంగేట్రం చేసిన సునీల్ ఛెత్రి త‌ర్వాత కెప్టెన్‌గా ఎదిగి జ‌ట్టును ముందుకు న‌డిపిస్తున్నాడు. ఛెత్రి ఇప్పటివరకు 131 మ్యాచ్‌ల్లో దేశానికి ప్రాతినిధ్యం వ‌హించి 84 అంత‌ర్జాతీయ‌ గోల్స్‌ చేశాడు. అత్య‌ధిక గోల్స్ చేసిన జాబితాలో అతనిది మూడో స్థానం.  రొనాల్డో (117), మెస్సీ (90) ముందున్నారు.
India
football team
sunil chetri
fifa
Narendra Modi

More Telugu News