Gangster Nayeem: ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుడు శేషన్న

gangster nayeem righ hand and close associate sheshanna arrested
  • ఇద్దరూ కలిసి దందాలు, హత్యలు
  • ఆరు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న శేషన్న
  • వాహన తనిఖీల్లో పోలీసులకు చిక్కిన వైనం
పలు హత్యకేసుల్లో నిందితుడిగా ఉండి సుదీర్ఘకాలంగా తప్పించుకుని తిరుగుతున్న మాజీ నక్సలైట్, గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుడు మద్దునూరి శేషయ్య, అలియాస్ శేషన్న ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. నిన్న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గోల్కొండ పోలీస్ స్టేసన్ పరిధిలోని షేక్ పేట క్రాస్‌రోడ్డులో వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులకు శేషన్న చిక్కాడు. ఓ 9 ఎంఎం పిస్టల్, 5 తూటాలను ఆయన నుంచి స్వాధీనం చేసుకున్నారు. 

నాగర్‌ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన శేషన్న పదో తరగతిలో ఉండగానే నక్సలైట్ ఉద్యమంలో చేరాడు. 1993లో సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాడా కేసులో అరెస్టయ్యాడు. మాజీ ఐపీఎస్ కేఎస్ వ్యాస్ హత్య కేసులో జైలుకు వెళ్లినప్పుడు అక్కడ నయీంతో ఏర్పడిన పరిచయం పెరిగి పెద్దదైంది. నిజానికి నక్సలైట్ ఉద్యమంలో ఉండగానే వీరిద్దరికీ పరిచయమున్నా జైలు పరిచయం వారిని మరింత దగ్గర చేసింది. బెయిలుపై బయటకు వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి చెలరేగిపోయారు. దందాలు, హత్యలతో భయభ్రాంతులకు గురిచేశారు. మాజీ నక్సలైట్ పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి హత్య సహా ఆరు హత్య కేసుల్లో శేషన్న నిందితుడిగా ఉన్నాడు. అలాగే, ఆయుధ చట్టం కింద మరో మూడు కేసులు ఆయనపై నమోదయ్యాయి. 

నయీం ఎన్‌కౌంటర్ తర్వాత పొరుగు రాష్ట్రాలకు పారిపోయి అక్కడ తలదాచుకున్న శేషన్న దందాలకు దూరమయ్యాడు. ఇటీవల హైదరాబాద్ హుమయూన్‌నగర్‌కు చెందిన ఓ మాజీ రౌడీషీటర్‌ను బెదిరించాలంటూ ఆ ప్రాంతంలోని ఫస్ట్ లాన్సర్‌కు చెందిన అబ్దుల్లాకు శేషన్న తుపాకి ఇచ్చిన విషయం పోలీసుల చెవినపడింది. అబ్దుల్లా ఇంట్లో తనిఖీలు చేసి తుపాకిని స్వాధీనం చేసుకున్న పోలీసులు శేషన్న కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో నిన్న పోలీసులకు చిక్కాడు. శేషన్న ప్రస్తుతం బీఎన్ రెడ్డి నగర్‌లోని చైతన్యనగర్ కాలనీలో ఉంటూ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Gangster Nayeem
SheShanna
Hyderabad

More Telugu News