Russia: ఐరాసలో మరోసారి భారత్ కు మద్దతుగా నిలిచిన రష్యా

Russia advocates for permanent membership to India in UNSC
  • ఐరాస సర్వప్రతినిధి సభలో రష్యా విదేశాంగ మంత్రి ప్రసంగం
  • భద్రతామండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం అంశం ప్రస్తావన
  • బ్రెజిల్ కు కూడా చోటు కల్పించాలన్న లావ్రోవ్
  • ఈ రెండు దేశాలు అంతర్జాతీయంగా కీలకమని వెల్లడి
భారత్ కు చిరకాల మిత్రదేశం రష్యా అంతర్జాతీయ వేదికపై మరోసారి బాసటగా నిలిచింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వంపై రష్యా తన మద్దతు ప్రకటించింది. 

ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రసంగిస్తూ, భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వానికి భారత్ కు అన్ని అర్హతలు ఉన్నాయని స్పష్టం చేశారు. భారత్ తో పాటు బ్రెజిల్ కు కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. 

భద్రతామండలిలో తీసుకురావాల్సిన మార్పులపై ప్రతిపాదనల పరంగా భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తోందని తెలిపారు. మండలిలో ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల ప్రాతినిధ్యాన్ని విస్తరించడం అవసరమని, తద్వారా మండలిలో ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుందని వివరించారు

ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అంతర్జాతీయ సమాజంలో భారత్, బ్రెజిల్ ల పాత్ర ప్రముఖమైనదని కొనియాడారు. ఈ రెండు దేశాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. 

అదే సమయంలో, కొత్తగా పాశ్చాత్య దేశాలకు భద్రతామండలిలో స్థానం కల్పించడం వల్ల ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. ఎందుకంటే పశ్చిమ దేశాలు చాలావరకు అమెరికాకే మద్దతు పలుకుతాయని, మండలిలో మరిన్ని పశ్చిమ దేశాలకు ప్రాతినిధ్యం కల్పించినా, పెద్దగా మార్పేమీ ఉండదని అభిప్రాయపడ్డారు.

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ప్రస్తుతం ఐదు శాశ్వత సభ్యదేశాలు ఉన్నాయి. అవి... అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్. ఇక రెండేళ్లకోసారి 10 తాత్కాలిక సభ్య దేశాలను ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ద్వారా ఎన్నుకుంటారు. ప్రస్తుతం భారత్ ఐరాసలో తాత్కాలిక సభ్యదేశంగా ఉంది. ఈ గడువు డిసెంబరుతో ముగియనుంది.
Russia
India
Permanent Membership
UNSC

More Telugu News