Harmanpreet Kaur: వైరల్ వీడియో: దీప్తి చేసిన రనౌట్‌తో ఇంగ్లండ్ శిబిరం షాక్.. కన్నీటి పర్యంతమైన డీన్!

England dressing rooms stunned reaction after Deepti s run out
  • గత రాత్రి లార్డ్స్‌లో మ్యాచ్
  • భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన డీన్
  • డీన్‌ను మన్కడింగ్ చేసిన దీప్తి
  • దీప్తికి మద్దతుగా నిలిచిన హర్మన్‌ప్రీత్
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా గతరాత్రి లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్ 3-0తో భారత్ సొంతమైంది. 170 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ వికెట్లు టపటపా రాలిపోవడంతో మ్యాచ్ ఏకపక్షమేనని, భారత్ విజయం లాంఛనమేనని అనుకున్నారు. అయితే, చివర్లో చార్లొట్ డీన్ అద్భుతమైన పోరాట పటిమతో ఏకపక్షంగా సాగుతుందనుకున్న మ్యాచ్ కాస్తా ఉత్కంఠగా మారింది. 118 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్‌కు విజయంపై ఏమాత్రం ఆశలు లేని సమయంలో డీన్ క్రీజులో పాతుకుపోయింది. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారింది.

ఈ క్రమంలో ఆమె అవుటైన తీరు అందరినీ ఆశ్చర్యపరచడమే కాదు.. క్రికెట్ ప్రపంచంలో మరోమారు తీవ్ర చర్చనీయాంశమైంది. దీప్తిశర్శ బౌలింగులో డీన్ రనౌట్ అయింది. 44వ ఓవర్ మూడో బంతిని సంధించేందుకు దీప్తి ముందుకు రాగా, డీన్ అప్పటికే క్రీజును వదిలి ముందుకొచ్చేసింది. దీంతో దీప్తి బంతిని సంధించకుండా వెనక్కి వచ్చి వికెట్లను గిరాటేసింది. దీనిని సాధారణంగా ‘మన్కడింగ్’గా పిలుస్తారు. గతంలో టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇలాగే చేయడం తీవ్ర వివాదాస్పదమైంది.

ఈ అవుట్‌తో ఇంగ్లండ్ శిబిరం నివ్వెరపోయింది. ఇంగ్లండ్ కెప్టెన్ అమీ జోన్స్ ఈ అవుట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మాత్రం దీప్తికి మద్దతు పలికింది. ఆమె అప్రమత్తతను ప్రశంసించింది. ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూములోని క్రికెటర్లు మాత్రం షాకయ్యారు. ఇంకోవైపు, అవుట్ నిర్ణయం కాస్తా థర్డ్ అంపైర్‌కు చేరింది. థర్డ్ అంపైర్ కూడా దానిని అవుట్‌గానే నిర్ధారించడంతో డీన్ కన్నీళ్లు పెట్టుకుంది. ఆపై మైదానాన్ని వీడుతూ ఇండియన్ ప్లేయర్లతో చేతులు కలిపింది. అనంతరం హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ.. తామేదో కొత్తగా చేసినట్టు భావించడం లేదని, అది బౌలర్ అప్రమత్తతకు నిదర్శనమని కొనియాడింది. నిబంధనలకు విరుద్ధంగా దీప్తి ప్రవర్తించలేదని వెనకేసుకొచ్చింది.
Harmanpreet Kaur
Deepti Sharma
Charlotte Dean
England
Team India

More Telugu News