Congress: 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందన్న ప్రధాని ప్రశ్నకు రాహుల్ సమాధానం ఇదే!

PM often asks 70 saal me kya kiya Rahul Gandhi responds in a tweet
  • కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగం ఈ స్థాయిలో లేదన్న రాహుల్ గాంధీ
  • ఈ ప్రభుత్వం ఐదారుగురు ధనవంతుల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందన్న రాహుల్
  • యువత, మహిళలను గాలికొదిలేసిందని విమర్శలు
70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఈ దేశానికి ఏం చేసిందన్న ప్రశ్నకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఘాటుగా బదులిచ్చారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ‘భారత్ జోడో’ యాత్ర చేపట్టిన రాహుల్ నిన్న ప్రధానిని లక్ష్యంగా చేసుకున్నారు. వీలు చిక్కినప్పుడల్లా ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడుతూ ఉంటారు. ఏడు దశాబ్దాల కాంగ్రెస్ పాలనను తూర్పారబడుతూ ఉంటారు. కాంగ్రెస్ హాయంలో నిర్లక్ష్యానికి గురైన మారుమూల గ్రామాలను తామెలా అభివృద్ధి చేసిందీ చెబుతూ విమర్శలు కురిపిస్తూ ఉంటారు. 

ఈ నేపథ్యంలో నిన్న రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా తీవ్రంగా స్పందించారు. 70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేసిందని ప్రధాని తరచూ ప్రశ్నిస్తూ ఉంటారన్న రాహుల్.. తమ పాలనలో నిరుద్యోగం ఈస్థాయిలో లేదని కౌంటరిచ్చారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్నంత అత్యధిక ధరలు తమ పాలనలో లేవని ఎద్దేవా చేశారు. క్రోనీ కేపిటలిజంపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. 

ఈ ప్రభుత్వం రైతుల కోసం, యువత కోసం, మహిళల కోసం పని చేయడం లేదన్నారు. అత్యంత ధనవంతులైన ఐదారుగురి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్న రాహుల్.. కోరుకున్న వ్యాపారాలను వారికి అప్పగిస్తూ గుత్తాధిపత్యానికి తెరతీసిందని ఆరోపించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తారస్థాయిలో ఉండగా ప్రభుత్వం మాత్రం ఈ ఐదారుగురి ప్రయోజనాల కోసం పనిచేస్తోందని దుమ్మెత్తి పోశారు. 

ఓ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ యువతను ఉద్దేశించి ప్రధాని మోదీ వర్చువల్‌గా మాట్లాడుతూ.. సంకీర్ణ ప్రభుత్వాలతో భారత ప్రతిష్ఠ దారుణంగా దెబ్బతిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ ఇలా స్పందించారు.
Congress
Rahul Gandhi
Narendra Modi
Crony Capitalism

More Telugu News