TTD: బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీవారి బ్రేక్ దర్శనాల వేళల్లో మార్పు

  • ఈ నెల 27 నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు
  • నేడు సమావేశమైన టీటీడీ ధర్మకర్తల మండలి
  • పలు కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ
  • ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు బ్రేక్ దర్శనాలు
  • బ్రహ్మోత్సవాల తర్వాత టైమ్ స్లాట్ టోకెన్ విధానం
TTD takes key decisions

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి నేడు సమావేశమైంది. తిరుమలలో భక్తుల రద్దీ నియంత్రణకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 

శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం బ్రేక్ దర్శనాల వేళల్లో మార్పు చేయనున్నారు. ప్రయోగాత్మకంగా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు బ్రేక్ దర్శనాలు ఏర్పాటు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 

బ్రహ్మోత్సవాల తర్వాత టైమ్ స్లాట్ టోకెన్ విధానం ప్రారంభం అవుతుందని టీటీడీ పేర్కొంది. సర్వదర్శనం టోకెన్ల జారీ కూడా బ్రహ్మోత్సవాల తర్వాత ఉంటుందని వివరించింది. ప్రాథమికంగా రోజుకు 20 వేల చొప్పున సర్వదర్శన టోకెన్ల జారీ ఉంటుందని వెల్లడించింది. 

ఇక తిరుమల గదుల కేటాయింపులోనూ మార్పునకు టీటీడీ నిర్ణయించింది. తిరుమల వసతి గదుల కేటాయింపు తిరుపతిలోనే చేయాలని భావిస్తోంది. 

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5 వరకు జరగనున్నాయి. కరోనా సంక్షోభం సద్దుమణిగిన నేపథ్యంలో ఈసారి స్వామివారి వాహన సేవలను భక్తుల నడుమ తిరుమాడ వీధుల్లో నిర్వహించనున్నారు.

More Telugu News