Narendra Modi: ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదని పుతిన్ కు మోదీ చెప్పడంపై... రష్యా రాయబారి స్పందన!

Russia Reaction To PM Modis Not An Era of War Remark To Putin
  • భారత్ కోణం నుంచి మోదీ వ్యాఖ్యలు సరైనవేనన్న ఇండియాలో రష్యా రాయబారి
  • పశ్చిమ దేశాల వైఖరి మాత్రం సరిగా లేదని విమర్శ
  • ఉక్రెయిన్ కు పాకిస్థాన్ ఆయుధాలు సరఫరా చేస్తున్నది నిజమైతే ఇరు దేశాల బంధాలపై ప్రభావం పడుతుందని వ్యాఖ్య
ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్ కు భారత ప్రధాని మోదీ చెప్పిన విషయం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలను అందుకున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ పై చేస్తున్న యుద్ధానికి ముగింపు పలకాలనే దిశగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రష్యా స్పందించింది. ఇండియాలో రష్యా రాయబారిగా ఉన్న డెనిస్ అలిపోవ్ మాట్లాడుతూ, భారత్ కోణం నుంచి చూస్తే ఆ వ్యాఖ్యలు సరైనవే అని చెప్పారు. పశ్చిమ దేశాల వైఖరి మాత్రం సరిగా లేదని అన్నారు. పశ్చిమ దేశాలు వాటికి అనుకూలంగా మాట్లాడతాయని... ఇతర ప్రాంతాల గురించి వారు పట్టించుకోరని విమర్శించారు. 

తమ వ్యాపార కార్యకలాపాలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలను కూడా రష్యా అంగీకరించదని చెప్పారు. రష్యా ఎగుమతి చేస్తున్న చమురు ధరపై జీ-7 దేశాలు క్యాప్ విధించడంపై అలిపోవ్ మండిపడ్డారు. జీ-7 దేశాలు నిర్ణయించే చమురు ధరలు తమకు అంగీకారయోగ్యం కాకపోతే... ఆయా దేశాలకు చమురు ఎగుమతులను ఆపేస్తామని హెచ్చరించింది. తమ చమురు ధరను జీ-7 దేశాలు తగ్గిస్తే... ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తుతుందని అన్నారు. 

ఉక్రెయిన్ కు పాకిస్థాన్ ఆయుధాలు పంపుతోందనే వార్తలపై అలిపోవ్ స్పందిస్తూ... అదే నిజమైతే పాకిస్థాన్ తో తమ సంబంధాలపై నెగెటివ్ ప్రభావం పడుతుందని చెప్పారు. ఇప్పటి వరకైతే పాక్ ఆయుధాలు సరఫరా చేస్తోందనే సమాచారం తమ వద్ద లేదని అన్నారు. వాస్తవాలు ఏమిటనేది తనకు కూడా తెలియదని చెప్పారు. ఒకవేళ నిజమైతే మాత్రం... పాకిస్థాన్ తో తమ సంబంధాలపై కచ్చితంగా పెను ప్రభావం ఉంటుందని అన్నారు.
Narendra Modi
BJP
Vladimir Putin
Russia
Ukraine
War
Pakistan

More Telugu News