zepto: 19 ఏళ్లకే వెయ్యి కోట్ల సంపాదనతో రికార్డుకెక్కిన భారత యువ వ్యాపారవేత్త

  • ఐఐఎఫ్ ఎల్ వెల్త్-హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో చోటు 
  • ఈ ఘనత సాధించిన పిన్నవయస్కుడిగా జెప్టో వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా
  • స్నేహితుడితో కలిసి గతేడాది జెప్టో ను ప్రారంభించిన వోహ్రా
At 19 This Entrepreneur Is Youngest Indian To Enter 1000 Crore Club

సాధారణంగా 19 ఏళ్ల వయసు యువకులు పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. కళాశాలలో స్నేహితులతో సరదగా గడుపుతుంటారు. అయితే, ఈ కుర్రాడు మాత్రం 19 ఏళ్లకే వ్యాపారవేత్త అవతారం ఎత్తాడు. చిన్న కంపెనీగా మొదలుపెట్టి అనతి కాలంలోనే దేశం మొత్తం విస్తరించేలా చేశాడు. దాంతో పాటు 19 ఏళ్ల వయసులోనే రూ. వెయ్యి కోట్ల నికర విలువ సాధించిన యువ వ్యాపారవేత్తగా రికార్డు సాధించాడు. అతనే క్విక్ డెలివరీ స్టార్టప్ ‘జెప్టో‘ సహ వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా.  స్నేహితుడు ఆదిత్ పాలిచాతో కలిసి తను జెప్టోను ప్రారంభించాడు. 

ఇప్పుడు ఈ ఇద్దరూ ఐఐఎఫ్ ఎల్ వెల్త్-హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో చోటు దక్కించుకున్న అతి పిన్న వయస్కులుగా నిలిచారు. 19 ఏళ్ల కైవల్య అత్యంత సంపన్న భారతీయుల్లో పిన్న వయస్కుడిగా రికార్డు సాధించాడు. హురున్ జాబితాలో రూ. 1,000 కోట్ల నికర విలువతో కైవల్య ఓవరాల్ గా 1036వ స్థానంలో ఉన్నాడు. ఆదిత్ పాలిచా  రూ. 1,200 కోట్ల నికర విలువతో 950వ స్థానంలో నిలిచాడు.  ఈ ఇద్దరూ ఇంతకు ముందు ఇ-కామర్స్ విభాగంలో ఫోర్బ్స్ మ్యాగజైన్ వెల్లడించిన ప్రభావవంతమైన ’30 అండర్ 30 (ఆసియా జాబితా)‘ లోనూ చోటు దక్కించుకున్నారు. 

ఈ ఇద్దరు యువ పారిశ్రామికవేత్తలు హురున్ ఇండియా ఫ్యూచర్ యునికార్న్ ఇండెక్స్ 2022లో అతి పిన్న వయస్కుడైన స్టార్ట్ అప్ వ్యవస్థాపకులు కావడం మరో విశేషం.  భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో వోహ్రా, పాలిచా చేరడంతో దేశంలోని స్టార్టప్‌ల కు పెరుగుతున్న ప్రభావాన్ని కూడా సూచిస్తోంది. ‘పదేళ్ల కిందట మా జాబితాలో వెయ్యి కోట్ల నికర విలువ కలిగిన పిన్నవయస్కుడు 37 ఏళ్ల వ్యక్తి. కానీ, ఇప్పుడు 19 ఏళ్లకే కైవల్య వోహ్రా ఈ జాబితాలోకి వచ్చారు. ఇది దేశంలో స్టార్టప్ విప్లవం ప్రభావాన్ని సూచిస్తోంది’ అని హురున్ ఇండియా రిచ్ లిస్ట్ పేర్కొంది.
 
వోహ్రా, పాలిచా స్టాన్‌ ఫోర్డ్ యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు. కరోనా మహమ్మారి రోజుల్లో నిత్యావసర వస్తువులను త్వరగా, కాంటాక్ట్ లెస్ గా డెలివరీ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను నెరవేర్చడానికి వీళ్లు 2021లో జెప్టో ను ప్రారంభించారు.

More Telugu News