Kadapa: కడపలో అర్ధరాత్రి కుంగిపోయిన మూడంతస్తుల భవనం.. చిక్కుకుపోయిన కుటుంబం

  • కడపలోని కో-ఆపరేటివ్ కాలనీలో ఘటన
  • ఒక్కసారిగా కుంగిపోయిన భవనం
  • చిక్కుకుపోయిన కుటుంబాన్ని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
A three storied building collapsed at midnight in Kadapa

అందరూ గాఢ నిద్రలో ఉన్నవేళ కడపలో ఓ మూడంతస్తుల భవనం కుంగిపోయింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనలో తొలి అంతస్తులో ఉంటున్న కుటుంబం చిక్కుకుపోయింది. స్థానిక కో-ఆపరేటివ్ బ్యాంకు కాలనీలోని విద్యామందిర్ సమీపంలో వెంకటరామరాజుకు ఓ మూడంతస్తుల భవనం ఉంది. అది పాతబడిపోవడంతో గ్రౌండ్ ఫ్లోర్‌లో అద్దెకు ఉంటున్న వారిని ఖాళీ చేయించి మరమ్మతులు చేయిస్తున్నారు. మొదటి అంతస్తులో ఓ కుటుంబం, రెండో అంతస్తులో మరో కుటుంబం ఉంటోంది. 

ఈ క్రమంలో బుధవారం అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో భవనం నుంచి శబ్దాలు వినిపించాయి. దీంతో ఒక్కసారిగా లేచిన రెండో అంతస్తులోని వారు బయటకు వచ్చి చూశారు. అప్పటికే భవనం ఓ వైపు కుంగిపోవడం చూసి భయభ్రాంతులకు గురయ్యారు. క్షణం ఆలస్యం చేయకుండా బయటకు పరుగులు తీశారు. 

అయితే, తలుపులు తెరుచుకోకపోవడంతో మొదటి అంతస్తులోని వారు మాత్రం లోపలే చిక్కుకుపోయారు. బయటకు వచ్చిన వారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి కిటికీ ఊచలు తొలగించి లోపల చిక్కుకుపోయిన దంపతులు, వారి ముగ్గురు పిల్లలను రక్షించారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News