Congress: శశిథరూర్ ఆశలపై నీళ్లు కుమ్మరిస్తున్న సొంత రాష్ట్ర కాంగ్రెస్ నేతలు!

He is an international man want Rahul says kerala congress
  • శశిథరూర్ అంతర్జాతీయ స్థాయి వ్యక్తి అంటున్న కేరళ నేతలు
  • రాహులే అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటున్నామన్న కె.సురేశ్
  • శశిథరూర్ పోటీ చేస్తారని తాను అనుకోవడం లేదన్న మరో నేత 
కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిని కావాలని కలలు కంటున్న తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు సొంత రాష్ట్రం నుంచే ఎదురుగాలి వీస్తోంది. ఆయన అంతర్జాతీయస్థాయి వ్యక్తి అని, అధ్యక్ష పదవికి పోటీ చేయకపోవడమే మంచిదని సొంతం రాష్ట్రం నేతలు హితవు చెబుతున్నారు. నిజానికి రాహుల్ గాంధీకే తిరిగి పట్టం కట్టాలంటూ చాలా రాష్ట్రాలు తీర్మానాలు కూడా చేశాయి. అయితే, అవి చెల్లబోవంటూ సీనియర్ నేత జైరాం రమేశ్ వంటివారు చెబుతున్నా పీసీసీలు మాత్రం తీర్మానం చేస్తూనే ఉన్నాయి.  

తాజాగా, లోక్‌సభలో కాంగ్రెస్ చీఫ్ విప్ కె.సురేశ్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. శశిథరూర్ అంతర్జాతీయ వ్యక్తి అని, ఆయన పోటీ చేయకపోవడమే బెటరని అన్నారు. ఏకాభిప్రాయం కలిగిన వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండాలని, రాహులే అధ్యక్షుడు కావాలని తాము ఇంకా కోరుకుంటున్నట్టు చెప్పారు. మరో ఎంపీ బెన్నీ బెహనాన్ మాట్లాడుతూ.. శశిథరూర్ హైకమాండ్ నిర్ణయాన్ని అనుసరిస్తారని అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని తాను భావించడం లేదన్నారు. 

‘ఏకాభిప్రాయం’ కలిగిన వ్యక్తిని అధ్యక్ష స్థానంపై కూర్చోబెట్టాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్న సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలిసిన థరూర్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్న తన ఆకాంక్షను ఆమె వద్ద బయటపెట్టారు. స్పందించిన సోనియా ‘మీ ఇష్టం’ అని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. 

నాలుగు ఆప్షన్లు
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో తమ ముందు నాలుగు ఆప్షన్లు ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అందులో మొదటిది రాహుల్ గాంధీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం. రెండోది, ఎవరూ నామినేషన్ దాఖలు చేయకుండా ఉండడం. అప్పుడు విషయం సీడబ్ల్యూసీ వద్దకు వెళ్తుంది. మూడోది, పోటీ లేకుండా ఏకాభిప్రాయం ఉన్న వ్యక్తిని ఎన్నుకోవడం. చివరగా ఎన్నిక నిర్వహించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం. శశిథరూర్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రేసులో ఉన్నట్టు ఇప్పటికే ప్రకటించారు కాబట్టి వారిలో ఎవరినో ఒకరిని ఎన్నుకోవడమే నాలుగో ఆప్షన్ అని విశ్వనీయ వర్గాలు చెబుతున్నాయి.
Congress
Shashi Tharoor
Rahul Gandhi
Kerala
K Suresh
Benny Behanan

More Telugu News