Meesho: ‘రీసెట్ అండ్ రీచార్జ్’ పేరిట ఉద్యోగులకు 11 రోజుల వరుస సెలవులు ప్రకటించిన ‘మీషో’

  • ఉద్యోగుల విషయంలో ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తున్న ‘మీషో’
  • ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద 
  • అక్టోబరు 22 నుంచి 11 రోజులపాటు వరుస సెలవులు
  • ఇటీవల ‘మీ కేర్’ పేరుతో 365 రోజుల సెలవుల కార్యక్రమాన్ని తీసుకొచ్చిన వైనం
  • ఉద్యోగులకు ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని కల్పించాలన్నదే లక్ష్యమన్న సంస్థ
Meesho announces 11 day reset and recharge break for staff mental wellness

ఉద్యోగుల ఫ్రెండ్లీ సంస్థగా గుర్తింపు పొందిన ప్రముఖ ఈకామర్స్ సంస్థ ‘మీషో’ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వారి మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ‘రీసెట్ అండ్ రీచార్జ్’ పేరిట అక్టోబరు 22 నుంచి 11 రోజులపాటు అంటే నవంబరు 1 వరకు వరుస సెలవులు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. 

ఉద్యోగులకు ఈ సంస్థ ఇలా రీచార్జ్ సెలవులు ప్రకటించడం వరుసగా ఇది రెండోసారి. గతేడాది దసరా అమ్మకాల తర్వాత పది రోజులపాటు సెలవులు ఇచ్చింది. తాజాగా, మరోమారు అలాంటి ప్రకటనే చేసింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న మీషోలో ప్రస్తుతం 2 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కంపెనీ విలువ బిలియన్ డాలర్లకు చేరింది. ఫలితంగా యూనికార్న్ జాబితాలో చోటు దక్కించుకుంది.

దసరా అమ్మకాల నేపథ్యంలో ఉద్యోగులు ఊపిరిసలపకుండా ఉంటారని, అది వారి మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. వారికి ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని కల్పించాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొంది. ఉద్యోగి విధుల పట్ల సంతృప్తిగా ఉండాలంటే వర్క్-లైఫ్ బ్యాలెన్స్, విశ్రాంతి, పునరుత్తేజం అనేవి చాలా ముఖ్యమైనవని పేర్కొంది. వాటిని గుర్తిస్తే కంపెనీ పని సంస్కృతి మరింత మెరుగుపడుతుందని, తమ ఈ ‘రీసెట్ అండ్ రీచార్జ్’ ప్రోగ్రాంతో సంప్రదాయ కార్యాలయ నిబంధనలకు కొత్త అర్థం ఇవ్వాలని కోరుకుంటున్నట్టు వివరించింది. ఈ బ్రేక్‌ను ఉద్యోగులు తమకు నచ్చిన విధంగా గడపొచ్చని పేర్కొంది.

ఉద్యోగుల విషయంలో పూర్తి కేర్ తీసుకుంటూ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తున్న మీషో ఇటీవల ‘మీకేర్’ అనే మరో కార్యక్రమాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా అవసరమైన ఉద్యోగులకు 365 రోజుల సెలవులు ఇవ్వనుంది. ఉద్యోగి, లేదంటే వారి కుటుంబంలోని ఎవరైనా దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ ఉంటే వారి బాగోగులు చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ సెలవుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు, వ్యక్తిగత అభిరుచులు, లక్ష్యాల సాధన కోసం కూడా ఈ సెలవులను వాడుకోవచ్చు. అలాగే, నెల రోజులపాటు మాతృత్వ, పితృత్వ సెలవులను కూడా ఇస్తోంది.

More Telugu News