Telangana: తెలంగాణ‌లో రేప‌టి నుంచే బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీ

  • కోటి చీర‌ల‌ను పంపిణీ చేయ‌నున్న‌ట్లు కేటీఆర్ ప్ర‌క‌ట‌న‌
  • 240 రకాల చీర‌ల‌ను పంపిణీకి సిద్ధం చేసిన‌ట్లు వెల్ల‌డి
  • చీర‌ల కోసం రూ.339 కోట్ల‌ను వెచ్చించామ‌న్న మంత్రి
batukamma sarees distribution starts from tomorrow

తెలంగాణలో మ‌హిళ‌లకు తెలంగాణ ప్రభుత్వం ఏటా అందించే బతుకమ్మ చీరల పంపిణీని రేపటి నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నేతన్నలకు చేయూతనివ్వడంతోపాటు, ఆడబిడ్డలకు చిరుకానుక ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని 2017లో ప్రారంభించినట్టు కేటీఆర్ తెలిపారు. 

బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం రేపటి (22వ తేదీ) నుండి ప్రారంభం అవుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ అవుతుందన్నారు. చీరల పంపిణీ కార్యక్రమం కోసం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ తమ టెక్స్ టైల్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. 

ఇందులో భాగంగా ఈ సంవత్సరం సైతం సూమారు కోటి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది గతంలో కన్నా మరిన్ని ఎక్కువ డిజైన్లు, రంగుల వెరైటీల్లో ఈ చీరలను తెలంగాణ టెక్స్ టైల్స్ శాఖ తయారు చేసిందన్నారు. గ్రామాల నుంచి వచ్చిన మహిళా ప్రతినిధుల అభిప్రాయాలు, ఆసక్తులు, నిఫ్ట్ డిజైనర్లల సహకారంతో సరైన డిజైన్ లు మరియు అత్యుత్తమ ప్రమాణాలతో ఈ సంవత్సరం బతుకమ్మ చీరల నూతన డిజైనులను ఉత్పత్తి చేశామన్నారు. 

ఈ సంవత్సరం 24 విభిన్న డిజైన్లు, 10 రకాల ఆకర్షణీయమైన రంగులలో మొత్తం 240 రకాల త్రెడ్ బోర్డర్ (దారపు పోగుల అంచులు) తో తయారు చేయబడిన 100% పాలిస్టర్ ఫిలిమెంట్ నూలు చీరలను తమ శాఖ తయారు చేసిందన్నారు. ఇందుకోసం రూ. 339.73 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆయ‌న పేర్కొన్నారు.

More Telugu News