Chandrababu: 175 సీట్లు కాదు... దమ్ముంటే పులివెందులలో గెలువు చూద్దాం: సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్

  • చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • కుప్పం జైల్లో టీడీపీ నేతలకు పరామర్శ
  • సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు
  • పోలీసులపైనా ఆగ్రహావేశాలు
Chandrababu fires on CM Jagan in Kuppam

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ చిత్తూరు జైల్లో కుప్పం టీడీపీ నేతలతో మాట్లాడారు. అనంతరం టీడీపీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇటీవల తాను పర్యటనకు వస్తే టీడీపీ నేతలంతా తన వెంటే ఉన్నారని వెల్లడించారు. 

జరిగిన ఘటనపై టీడీపీ నేతలు ప్రశ్నిస్తే, తిరిగి వారిపైనే పోలీసులు కేసులు పెట్టారని ఆరోపించారు. మీరేం పోలీసులండీ... ప్రశ్నించిన వాళ్లపై కేసులు పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీలపైనే ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని వెల్లడించారు. 

పోలీసులు అందరినీ తాను అనడంలేదని, వారిలో 10 శాతం మంది తప్పుడు మార్గంలో వెళుతున్నారని విమర్శించారు. వాళ్ల లెక్కలు తాను రాసిపెడుతున్నానని అన్నారు. నమ్మకద్రోహులు అని పేర్కొన్నారు. పోలీసుల్లో 90 శాతం మంది మంచివారేనని, కానీ ఏమీ చేయలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. 

ఆయుధాలున్నాయంటూ తమ వాళ్లపై కేసులు పెడుతున్నారని, ఆయుధాలు ఉంటే పులివెందులలో ఉండొచ్చేమో అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. కేసులు పెడితే భయపడి పారిపోతామని జగన్ అనుకుంటున్నాడని, కానీ అది ఎప్పటికీ జరగదని స్పష్టం చేశారు. బాబాయి హత్య జరిగితే గుండెపోటు అంటాడని, నారాసుర రక్తచరిత్ర అంటూ నేనే చంపానని ప్రచారం చేశారని మండిపడ్డారు.

జగన్ సీబీఐనే బెదిరిస్తున్నాడని, సీబీఐ వద్ద ఆయనపై 11 కేసులు ఉన్నాయని,  సీబీఐ ఆ కేసుల బటన్ ను నొక్కితే ఈ జగన్ ఎక్కడుంటాడు? అని అన్నారు. నీ వద్ద పోలీసులున్నారని అనుకుంటున్నావేమో.... వాళ్లు రెండ్రోజులు ఉంటారు, మూడోరోజున నీ పోలీసులే నిన్ను అరెస్ట్ చేస్తారు అని స్పష్టం చేశారు. 

నా మీటింగులకు వచ్చిన వారిపై తప్పుడు కేసులు పెడతావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తల పేర్లు, వారిపై నమోదైన కేసులను సెక్షన్లతో సహా చదివి వినిపించారు. తమ నేతలు జైల్లో బాధపడుతుంటే పైశాచిక ఆనందంతో చూడ్డానికి ఎల్లుండి ముఖ్యమంత్రి కుప్పం వస్తున్నాడని అన్నారు. ఏం పీకాడని కుప్పం వస్తున్నాడు? అని ప్రశ్నించారు. 

"ఈసారి 175 సీట్లు గెలుచుకుంటామని జగన్ ధీమాగా చెబుతున్నాడు... దమ్ముంటే నీ పులివెందులలో గెలువు చూద్దాం. పులివెందుల వచ్చి ఏం చెబుతావు... బాబాయిని చంపడం గురించి చెప్పి ఓటెయ్యమని అడుగుతావా? కోడికత్తి పేరు చెప్పి ఓట్లు అడుగుతావా?" అని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇక, కేసుల పట్ల కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, వారికి తాను అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు.

More Telugu News