Shashi Tharoor: రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ చీఫ్ గా గాంధీ కుటుంబేతర వ్యక్తి!

Shashi Tharoor vs Ashok Gehlot For Congress President
  • 1998 నుంచి గాంధీల చేతుల్లోనే కాంగ్రెస్ చీఫ్ బాధ్యతలు
  • నిన్న సోనియాగాంధీని కలిసి చర్చలు జరిపిన శశిథరూర్
  • చివరి సారిగా పార్టీ చీఫ్ గా పని చేసిన గాంధీ కుటుంబేతర వ్యక్తి సీతారాం కేసరి
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ లో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. గత రెండు దశాబ్దాల కాలంలో తొలిసారి గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి పార్టీ పగ్గాలను అందుకోబోతున్నారు. త్వరలోనే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగబోతోంది. ఈ పదవి కోసం గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పోటీ పడుతున్నారు. 

మరోవైపు పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ఆయనపై పోటీ చేయనున్నారు. పార్టీలో అంతర్గతంగా సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్న వారిలో శశిథరూర్ కూడా ఉన్నారు. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలంటూ 2020లో సోనియాగాంధీకి లేఖ రాసిన జీ-23 గ్రూపులో ఆయన కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఆయన అధ్యక్ష పదవికి పోటీ పడుతుండటం ఆసక్తిని కలిగిస్తోంది. 

శశిథరూర్ పోటీకి సోనియాగాంధీ గ్రీన్ సిగ్నల్...
మరోవైపు, నిన్న మధ్యాహ్నం సోనియాను శశిథరూర్ కలిశారు. పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసే అంశంపై ఆమెతో మాట్లాడారు. శశిథరూర్ పోటీకి సోనియా అంగీకారం తెలిపారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టాలని కోరుకునే వ్యక్తుల్లో గెహ్లాట్ ఒకరు. ఈ నేపథ్యంలో, గాంధీల నాయకత్వాన్ని కోరుకునే వారందరూ గెహ్లాట్ కు ఓటు వేసే అవకాశం ఉంది. మరోవైపు మరో సీనియర్ నేత జైరామ్ రమేశ్ మాట్లాడుతూ, ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యానికి నిదర్శనమని అన్నారు. పార్టీ టాప్ పొజిషన్ కోసం ఎవరైనా పోటీ చేయవచ్చని ఆయన అన్నారు. 

1998 నుంచి కాంగ్రెస్ అధ్యక్ష పదవి గాంధీల చేతుల్లోనే...
కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా సోనియాగాంధీ 19 ఏళ్ల పాటు వ్యవహరించిన తర్వాత 2017 తన కుమారుడు రాహుల్ గాంధీకి ఛార్జ్ అప్పగించారు. అయితే 2019లో రాహుల్ అధ్యక్ష బాధ్యతలను వదిలేయడంతో... మళ్లీ సోనియానే పగ్గాలను స్వీకరించారు. గాంధీల కుటుంబం నుంచి కాకుండా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను నిర్వహించిన చివరి బయట వ్యక్తి సీతారాం కేసరి కావడం గమనార్హం. 

1998లో ఆయన నుంచి సోనియాగాంధీ పార్టీ బాధ్యతలను స్వీకరించారు. పీవీ నరసింహారావు ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా మారిన తరుణంలో సోనియా రంగంలోకి దిగారు. తన భర్త రాజీవ్ గాంధీ మరణంతో రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్న ఆమె... పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అప్పటి నుంచి పార్టీ అధ్యక్ష బాధ్యతలు గాంధీ కుటుంబం చేతిలోనే ఉండిపోయాయి. ఇప్పుడు మళ్లీ గాంధీ కుటుంబేతరుల చేతిలోకి పార్టీ బాధ్యతలు వెళ్లే కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది.
Shashi Tharoor
Ashok Gehlot
Sonia Gandhi
Congress
President
Elections

More Telugu News