Droupadi Murmu: లండన్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Droupadi Murmu arrives in London for Queen funeral
  • బ్రిటన్ రాణికి భారత్ తరఫున నివాళి అర్పించనున్న ముర్ము
  • రేపు క్వీన్ ఎలిజబెత్2 అంత్యక్రియలు
  • హాజరుకానున్న ప్రపంచ దేశాల అధినేతలు
బ్రిటన్ రాణి, దివంగత క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలలో పాల్గొనడానికి, భారత ప్రభుత్వం తరఫున అధికారిక నివాళి అర్పించడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్ చేరుకున్నారు. రాష్ట్రపతికి లండన్ లో భారత దౌత్యవేత్తలు ఘన స్వాగతం పలికారు. 96 ఏళ్ల క్వీన్ ఎలిజబెత్ 2 ఈనెల 8న కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో సోమవారం లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో జరుగుతాయి. శవపేటికను అబ్బే నుంచి లండన్‌లోని వెల్లింగ్‌టన్ ఆర్చ్ వరకు విండ్సర్‌కు వెళ్లేందుకు ఊరేగింపుగా తీసుకెళ్తారు. అంత్యక్రియలకు వివిధ దేశాల అధినేతలు కూడా హాజరవుతారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే లండన్ చేరుకున్నారు. 

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో,  ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రెసిడెంట్ సెర్గియో మట్టరెల్లా, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మిచెల్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, చైనా ఉపాధ్యక్షుడు వాంగ్ జిషన్,  నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ తదితరులు కూడా అంత్యక్రియలకు హాజరవుతారు. రష్యా, మయన్మార్, బెలారస్, సిరియా, వెనిజులా, ఆఫ్ఘనిస్థాన్ దేశాలకు మాత్రం ఆహ్వానం అందలేదు.
 
కాగా, ఆదివారం సాయంత్రం బకింగ్‭హమ్ ప్యాలెస్‭లో కింగ్ చార్లెస్-3 ఆధ్వర్యంలో జరిగే ప్రపంచాధినేతల కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము పాల్గొంటారు. ఇక, బ్రిటన్ రాణి మృతికి సంతాప సూచకంగా భారత ప్రభుత్వం దేశంలో ఇప్పటికే జాతీయ సంతాప దినాన్ని అధికారికంగా నిర్వహించింది.
Droupadi Murmu
india
president
london
Queen Elizabeth II
funeral

More Telugu News