Andhra Pradesh: రాజ‌ధానిని నిర్మించుకోలేని అస‌మ‌ర్థ సీఎంగా జ‌గ‌న్‌: బీజేపీ నేత స‌త్య‌కుమార్‌

bjp leader sathya kumar comments on apgovernment petiton in supreme court
  • హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు స‌మ‌ర్థిస్తుంద‌న్న స‌త్య‌కుమార్‌
  • త‌మ నిర్ణ‌యంపై న‌మ్మ‌కం లేక‌నే ఇన్నాళ్లు వైసీపీ ప్ర‌భుత్వం ఆగింద‌ని ఆరోప‌ణ‌
  • 3 రాజ‌ధానుల పేరిట జ‌గ‌న్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చ‌గొడుతున్నార‌ని విమ‌ర్శ‌
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ వైసీపీ స‌ర్కారు శ‌నివారం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన తీరుపై బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి స‌త్య‌కుమార్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హైకోర్టు ఇచ్చిన గ‌డువు ముగుస్తున్న స‌మ‌యంలో సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌డ‌మేమిట‌ని ఆయ‌న వైసీపీ స‌ర్కారును నిల‌దీశారు. ఈ మేర‌కు శ‌నివారం తిరుప‌తిలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న రాష్ట్ర ప్ర‌భుత్వ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

3 రాజ‌ధానుల‌పై హైకోర్టు 6 నెల‌ల క్రిత‌మే తీర్పు ఇచ్చిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా స‌త్య‌కుమార్ గుర్తు చేశారు. ఇన్ని రోజులు ప‌ట్టించుకోకుండా ఉండి... హైకోర్టు ఇచ్చిన గ‌డువు ముగుస్తున్న స‌మ‌యంలో సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేయ‌డం అంటే.. త‌మ నిర్ణ‌యంపై నమ్మకం లేద‌నే ఇన్నాళ్లు ఆగార‌ని ఆయ‌న అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు స‌మ‌ర్థిస్తుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కుంద‌ని ఆయ‌న అన్నారు. రాజ‌ధానిని నిర్మించుకోలేని అస‌మ‌ర్థ సీఎంగా జ‌గ‌న్ నిలిచార‌ని స‌త్య‌కుమార్ ఆరోపించారు. అమ‌రావ‌తికి గ‌తంలో మ‌ద్ద‌తు ఇచ్చిన జ‌గ‌న్‌.. ఇప్పుడు 3 రాజ‌ధానుల పేరిట ప్రాంతీయ విద్వేషాలు రెచ్చ‌గొడుతున్నార‌ని ఆయ‌న అన్నారు.
Andhra Pradesh
AP High Court
YSRCP
YS Jagan
BJP
Y SatyaKumar
Amaravati

More Telugu News