KCR: ఈ విచ్ఛిన్నకర శక్తుల ప్రయత్నాలను తిప్పికొట్టాలి.. లేకపోతే మళ్లీ మనకు ఆవేదన తప్పదు: కేసీఆర్

KCR speech in Telangana Integration Day celebration
  • పబ్లిక్ గార్డెన్స్ లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు
  • జాతీయ జెండాను ఎగురవేసిన కేసీఆర్
  • ఎందరో పోరాటాలతో తెలంగాణ రాచరికం నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛ వైపు పయనించిందన్న సీఎం
  • తెలంగాణ పోరాటంలో చావు అంచుల వరకు వెళ్లానని వ్యాఖ్య
  • మతతత్వంతో అలజడి సృష్టిస్తున్నారని బీజేపీపై మండిపాటు
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాదు, పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసు వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ లో రాచరిక పాలన కొనసాగిందని... ఆ తర్వాత ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగాల వల్ల తెలంగాణ సమాజం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛ వైపు పయనించిందని చెప్పారు. కొమురం భీమ్, దొడ్డి కొమురయ్య వంటి మహనీయుల త్యాగాలు మరువలేనివని అన్నారు. ఆనాడు మహోజ్వలమైన ఉద్యమం నడిచిందని తెలిపారు. ఎందరో మహానుభావులు చైతన్యాన్ని రగిలించారని చెప్పారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తిని తలచుకుందామని అన్నారు. 

1948 నుంచి 1956 వరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉందని... ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని కేసీఆర్ చెప్పారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి ఉండేదని... తాము దోపిడీకి గురవుతున్నామనే భావన ప్రజల్లో రోజురోజుకూ పెరిగిందని... స్వరాష్ట్రం ఆకాంక్ష బలపడిందని తెలిపారు. ఆ తర్వాత ఎన్నో పోరాటాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం తాను పోరాటం చేశానని, నిరాహార దీక్షకు కూడా దిగానని, చావు అంచుల వరకు వెళ్లానని తెలిపారు. 

తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో పురోగమించిందని కేసీఆర్ చెప్పారు. ఐటీ రంగంలో కర్ణాటకను సైతం తెలంగాణ అధిగమించిందని తెలిపారు. రైతులందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులను ఏర్పాటు చేశామని అన్నారు. ఇప్పుడు కొందరు మతతత్వంతో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని... ప్రజలందరూ ఈ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. 

మనుషుల మధ్య విభజన చేస్తూ... సమాజాన్ని చీల్చే ప్రయత్నాన్ని ఈ విచ్ఛిన్నకర శక్తులు చేస్తున్నాయని అన్నారు. ఈ దుష్ట శక్తుల ప్రయత్నాలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని బీజేపీని ఉద్దేశించి అన్నారు. తెలంగాణను సాధించిన వ్యక్తిగా, మీ బిడ్డగా ఈ విషయాన్ని మీకు వివరించడాన్ని తన బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు. ఈ నేల ప్రశాంతంగా ఉండాలే కానీ... మళ్లీ బాధల్లోకి వెళ్లకూడదని అన్నారు. మనం ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా... కొన్ని దశాబ్దాల పాటు మనం అనుభవించిన ఆవేదనను మళ్లీ అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
KCR
TRS
Telangana Integration Day

More Telugu News