Telangana: అమిత్​ షా వచ్చి ఏం చేస్తారు? నిధులిస్తారా.. రెచ్చగొట్టి వెళ్తారా?: కేటీఆర్​

Minister KTR fires on Amit sha
  • తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టే యత్నమని కేటీఆర్ ఆరోపణ
  • పోరాటాలు తెలంగాణ ప్రజలకు కొత్త కాదన్న మంత్రి  
  • అప్రమత్తంగా లేకుంటే తెలంగాణ వెనక్కి పోయే ప్రమాదం ఉందని వ్యాఖ్య
  • నాడు అంబేద్కర్ చేసిన ఏర్పాటు వల్లే తెలంగాణ వచ్చిందని వెల్లడి

తెలంగాణకు వచ్చే కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు రాష్ట్రానికి నిధులు తీసుకురావాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాష్ట్రానికి వచ్చే నిధుల గురించి ఇప్పుడైనా చెప్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి నిధులు ఏమైనా ఇస్తారా? లేక వర్గాలు, మతాల పేరుతో రెచ్చగొట్టి వెళతారా? అని నిలదీశారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 

మనుషుల మధ్య అంతరాలు సృష్టిస్తున్నారు
గత ఎనిమిదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో.. ఇప్పుడు కులమతాల పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కొందరు విద్వేషాలతో మనుషుల మధ్య అంతరాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైషమ్యాలను రెచ్చగొడుతున్నారని.. మత పిచ్చిలేపి తెలంగాణ సమాజాన్ని విడదీయాలని చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే రాష్ట్రం మళ్లీ దశాబ్దాల పాటు వెనకబడిపోయే ప్రమాదం ఉందని పిలుపునిచ్చారు. అయినా తెలంగాణ ప్రజలకు పోరాటాలు కొత్త కాదన్నారు.

అంబేద్కర్ వల్లే చిన్న రాష్ట్రాలు
  శాసనసభ అనుమతి లేకుండానే పార్లమెంటు చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చని.. నాడు అంబేద్కర్‌ రాసి ఉండకపోతే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో భవిష్యత్‌ తరాలకు అంబేద్కర్‌ గొప్పతనం తెలిసేలా తెలంగాణ సచివాలయానికి ఆయన పేరు పెట్టారని చెప్పారు. గత ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా సంక్షేమం, అభివృద్ధిని కలగలిపి సంస్కరణలు తెచ్చుకున్నామన్నారు.

  • Loading...

More Telugu News