Uttar Pradesh: భారీ వర్షాలకు కూలిన గోడలు.. యూపీలో 12 మంది సజీవ సమాధి

12 dead in separate wall collapse incidents in Lucknow and Unnao
  • అల్పపీడనం కారణంగా యూపీలో విస్తారంగా వర్షాలు
  • గోడలు కూలి లక్నోలో 9 మంది, ఉన్నావోలో ముగ్గురి మృతి
  • రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సీఎం
ఉత్తరప్రదేశ్‌లో కురుస్తున్న వానల కారణంగా గోడలు కూలిన ఘటనలో 12 మంది సజీవ సమాధి అయ్యారు. యూపీ రాజధాని లక్నోలోని దిల్‌కుషా ప్రాంతంలో నేడు ఇంటి గోడ కూలిన ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఉన్నావోలో జరిగిన మరో ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 

ఈ ఘటనలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. 

కాగా, దేశ రాజధాని ఢిల్లీలో నిన్న కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. నిన్న ఈ నెలలోనే అక్కడ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు, అల్పపీడనం కారణంగా ఉత్తరప్రదేశ్‌లో ఎడతెరిపిలేకుండా వానలు కురుస్తున్నాయి. రేపటి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వానల కారణంగా నేడు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
Uttar Pradesh
Lucknow
Unnao
Wall Collapse
Heavy Rain

More Telugu News