Ukraine: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

Ukraines Zelensky Involved In Car Accident Not Seriously Injured
  • జెలెన్ స్కీ వాహనాన్ని ఢీకొట్టిన ప్యాసింజర్ కారు
  • తీవ్ర గాయాలేవీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
  • సాధారణ ప్రమాదమా? కుట్రా? అన్నది తేలాల్సివుంది 
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ఈ ఉదయం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయన స్వల్ప గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అధ్యక్షుడి కాన్వాయ్ రాజధాని కీవ్ గుండా ప్రయాణిస్తుండగా ఎదురుగా వస్తున్న ప్యాసింజర్ కారు జెలెన్‌స్కీ వాహనాన్ని ఢీకొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్స్‌తో అక్కడికి చేరుకుని అధికారులు అధ్యక్షుడిని, ఆయన కారు డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. 

అధ్యక్షుడిని వైద్యులు పరీక్షించారని, తీవ్ర గాయాలేవీ కాలేదని నిర్ధారించారని ఉక్రెయిన్ అధికార ప్రతినిధి సెర్గీ నికిఫోరోవ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇది సాధారణ ప్రమాదమా? లేదంటే ఇందులో ఏదైనా కుట్ర దాగి ఉందా? అన్న విషయం తేల్చాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా, గత రాత్రి జెలెన్‌స్కీ టీవీలో మాట్లాడుతూ.. ఖార్ఖివ్ నుంచి రష్యా బలగాలు వెనక్కి మళ్లాయని ప్రకటించారు. ఆ ప్రాంతాన్ని తమ దళాలు పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయని అన్నారు. ఇది అపూర్వమైన ఘటన అని పేర్కొన్నారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ప్రమాదం జరగడం గమనార్హం.
Ukraine
Volodymyr Zelensky
Road Accident

More Telugu News